వలంటీర్ల ఫోన్లు అధికారుల వద్ద జమ చేయండి

6 Mar, 2021 03:53 IST|Sakshi

అవసరమైనప్పుడు అనుమతితో ఉపయోగించుకోండి

పూర్తి నిషేధం తగదు.. అది విధులకు ఆటంకం కలిగించడమే

దుర్వినియోగం చేస్తే చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేయవచ్చు

ఎన్నికల కమిషన్‌ అప్పీల్‌పై హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: వార్డు వలంటీర్ల మొబైల్‌ ఫోన్ల విషయంలో ఎన్నికల కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఈ నెల 3న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సవరించింది. వార్డు వలంటీర్లు లబ్ధిదారుల డేటా ఉన్న మొబైల్‌ ఫోన్లను మునిసిపల్‌ కమిషనర్లు నియమించే అధికారుల వద్ద జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. వలంటీర్లు ఆ అధికారుల అనుమతితో అవసరమైనప్పుడు మొబైల్‌ ఫోన్లను వారి పర్యవేక్షణలో ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసే విషయంలో తేదీ, సమయం, ప్రదేశాన్ని మునిసిపల్‌ కమిషనర్‌ నిర్ణయిస్తారని పేర్కొంది. మొబైల్‌ ఫోన్లను ఉపయోగించకుండా పూర్తిగా నిషేధించడం సరికాదన్న ధర్మాసనం, అలా నిషేధం విధించడం వారి విధులకు ఆటంకం కలిగించడమే అవుతుందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఒకవేళ వలంటీర్లు లబ్ధిదారుల డేటా ఉన్న మొబైల్‌ ఫోన్లను దుర్వినియోగం చేస్తే క్రమశిక్షణ చర్యల నిమిత్తం ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వానికి సిఫారసు మాత్రమే చేయవచ్చని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌ మాల్య బాగ్చీ, జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 

నేరుగా చర్యలు తీసుకునే పరిధి కమిషన్‌కు లేదు..
తమ ఆదేశాలను వలంటీర్లు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వుల్లో పేర్కొనడం తమను అత్యంత ఆందోళనకు గురి చేస్తోందని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలా నేరుగా చర్యలు తీసుకునే అధికారం, పరిధి ఎన్నికల కమిషన్‌కు లేదని స్పష్టం చేసింది. దీనిపై ఎన్నికల కమిషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు స్పందిస్తూ పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్ల తీరుపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుత ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ వలంటీర్లు ఎవరితో మాట్లాడారో సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి ఎన్నికల కమిషన్‌ వివరాలు తెప్పించుకోవచ్చు కదా? అని ప్రశ్నించింది. ఫిర్యాదులు ఎన్నో వస్తుంటాయని, అన్నీ వాస్తవం కాకపోవచ్చని పేర్కొంది. అవసరానికి మించి ఆంక్షలు విధిస్తున్నారన్న అభిప్రాయం ఈ కోర్టుకు కలుగుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం మునిసిపల్‌ కమిషనర్‌ ద్వారా నియమితులయ్యే అధికారి వద్ద మొబైల్‌ ఫోన్లు ఉంచాలన్న ప్రతిపాదనకు ఇరుపక్షాలు అంగీకరించడంతో హైకోర్టు ధర్మాసనం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది.  

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ఎస్‌ఈసీ అప్పీల్‌...
మునిసిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ గత నెల 28న ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.అజయ్‌జైన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఈ నెల 3న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా హౌస్‌మోషన్‌ రూపంలో అప్పీల్‌ దాఖలు చేయగా జస్టిస్‌ బాగ్చీ నేతృత్వంలోని ధర్మాసనం ఇంటి వద్ద విచారణ జరిపింది. 

మరిన్ని వార్తలు