చంద్రబాబు ప్రభుత్వ జీవోను తప్పుపట్టిన హైకోర్టు 

15 Oct, 2020 03:06 IST|Sakshi

సుప్రీం ఆదేశాల ప్రకారం భద్రత కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు స్థానం కల్పించాల్సిందే 

నాలుగు వారాల్లో సవరణ జీవో జారీచేయండి 

ప్రస్తుత ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

సాక్షి, అమరావతి: అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర భద్రత కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు ఉన్న స్థానాన్ని తొలగిస్తూ నాటి చంద్రబాబు ప్రభుత్వం జారీచేసిన జీవోను హైకోర్టు తప్పుపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర భద్రత కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు స్థానం ఉండాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. భద్రత కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు ఉన్న స్థానాన్ని తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జారీ అయిన జీవోను సవరించాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు నాలుగు వారాల్లో చర్యలు తీసుకుని తాజా జీవో జారీచేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 17కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర భద్రత కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రకాశ్‌సింగ్‌ వర్సెస్‌ అదర్స్‌ కేసులో సుప్రీంకోర్టు 2006లో తీర్పు వెలువరించింది.

ఈ కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు సైతం స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ తీర్పుననుసరించి  2013లో రాష్ట్ర భద్రత కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ జీవో 189 జారీ అయింది. హోంశాఖ మంత్రి ఎక్స్‌ అఫిషియో చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ప్రతిపక్ష నేత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రభుత్వం నామినేట్‌ చేసిన ఐదుగురు స్వతంత్ర సభ్యులు ఉంటారు. అయితే 2018లో చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ కమిషన్‌లో స్థానం కల్పించకూడదన్న ఉద్దేశంతో జీవో 189ని సవరించింది. కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు స్థానం లేకుండా చేస్తూ 2018లో జీవో 42 జారీచేసింది. దీన్ని సవాలు చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారించిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ యోగేష్‌ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భద్రతా కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు స్థానం కల్పించాలని, కాని ప్రతిపక్ష నేతకున్న స్థానాన్ని తొలగిస్తూ 2018లో జీవో జారీ చేసిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించింది. రాష్ట్ర భద్రత కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు స్థానం కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 42ను సవరించి, తాజాగా జీవో జారీ చేసేందుకు ప్రభుత్వానికి నాలుగు వారాల గడువునిచ్చింది. తదుపరి విచారణను నవంబర్‌ 17కి వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు