AP: హెచ్‌ఆర్‌సీ ఆదేశాలపై హైకోర్టు విస్మయం

18 Aug, 2022 07:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: భూ సేకరణ పరిహారం చెల్లింపులో జాప్యం చేసినందుకుగాను బాధితుడికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని జల వనరుల శాఖ అధికారులను ఆదేశిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. భూ సేకరణ వ్యవహారాల్లో పరిహారం చెల్లింపునకు ఆదేశాలు జారీచేసే అధికారం హెచ్‌ఆర్‌సీకి ఎక్కడ ఉందని ప్రశ్నించింది.

రూ.10 లక్షల పరిహారం చెల్లించాలన్న హెచ్‌ఆర్‌సీ ఆదేశాలను హైకోర్టు నిలిపేసింది.ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హెచ్‌ఆర్‌సీ రిజిస్ట్రార్, ఆరి్థక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, కర్నూలు కలెక్టర్, నంద్యాల ఆర్‌డీవోలను ఆదేశించింది. తదుపరి విచారణను సెపె్టంబర్‌ 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

10 లక్షల పరిహారం ఇవ్వాలన్న హెచ్‌ఆర్‌సీ 
నంద్యాలలోని వీరాపురం చెరువును పునరుద్ధరించాలని 1993లో అధికారులు నిర్ణయించారు. అందుకు కొంత భూమిని సేకరించాలని నిర్ణయించి ముసాయిదా భూ సేకరణ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే, సేకరించదలచిన భూములు పట్టా భూములు కాదని, ప్రభుత్వ భూములని తెలుసుకున్న అధికారులు ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. 

దీనిపై కొందరు వ్యక్తులు 2003లో హైకోర్టును ఆశ్రయించి పరిహారం చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఆ భూములు పట్టా భూములు కాకపోవడం, ఆ భూములను సేకరించకపోవడం వల్ల వాటికి ఎలాంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఆ తరువాత మరికొందరు ఇదే అంశంపై 2013లో హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. ఈ పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తుల్లో ఒకరైన ఎంజేఎస్‌ రాజు 2021లో హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. పరిహారం చెల్లించకుండా అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన హెచ్‌ఆర్‌సీ రాజుకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని జల వనరుల శాఖ అధికారులను ఆదేశిస్తూ ఈ ఏడాది మే 5న ఉత్తర్వులిచి్చంది. 

హెచ్‌ఆర్‌సీకి ఆ అధికారం లేదన్న హైకోర్టు 
ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, నీటి పారుదల శాఖ అధికారులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున ప్రభుత్వ న్యాయవాది (నీటి పారుదలశాఖ) శీలం శివకుమారి వాదనలు వినిపిస్తూ.. హెచ్‌ఆర్‌సీ ముందు వాస్తవాలను ఉంచలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని హెచ్‌ఆర్‌సీ సరైన దృష్టి కోణంలో చూడలేదన్నారు. 

భూ సేకరణ, పరిహారం తదితర అంశాలు హెచ్‌ఆర్‌సీ పరిధిలోకి రావని తెలిపారు. వివాదం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా, ఆ అంశంపై హెచ్‌ఆర్‌సీ జోక్యం తగదన్నారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. భూ సేకరణ, పరిహారం వ్యవహారాల్లో హెచ్‌ఆర్‌సీ ఎలా జోక్యం చేసుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. పరిహారం చెల్లింపు అధికారం ఎక్కడ ఉందని నిలదీసింది. రూ.10 లక్షల పరిహారం చెల్లించాలంటూ హెచ్‌ఆర్‌సీ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేసి.. కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.  

ఇది కూడా చదవండి: అప్పు పథంలో  ఐదు రాష్ట్రాలు

మరిన్ని వార్తలు