పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల..చట్టబద్ధతను తేలుస్తాం

19 Nov, 2021 02:46 IST|Sakshi

చట్టబద్ధతపైనే వాదనలు వినిపించాలి

రాజధానికి ఏ ప్రాంతం అనువైనదో మాకు సంబంధం లేని అంశం

తేల్చిచెప్పిన త్రిసభ్య ధర్మాసనం.. తదుపరి విచారణ నేటికి వాయిదా

సరదా మాటలూ పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయన్న ధర్మాసనం

సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల చట్టబద్ధతను మాత్రమే తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ రెండు చట్టాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనుసరించిన నిర్ణాయక విధానాన్ని కూడా తేలుస్తామంది. రాజధాని ఏర్పాటుకు ఏ ప్రాంతం అనువైనదన్న అంశం తమకు సంబంధించినది కాదని, అందువల్ల దానిజోలికి వెళ్లబోమని తేల్చిచెప్పింది. తమ ముందున్నది నగరాల మధ్య పోటీ వివాదం కాదంది. అందువల్ల న్యాయవాదులు చట్టాల చట్టబద్ధత గురించే వాదనలు వినిపించాలంది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం నాలుగోరోజు విచారణ జరిపింది.

ఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా తాము సరదాగా మాట్లాడుతున్న మాటలు కూడా ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో పతాక శీర్షికలవుతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో వాదనల సమయంలో తాము పూర్తిస్థాయి చర్చలోకి వెళ్లలేకపోతున్నామని, ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొందని తెలిపింది. తమ సందేహాలను నివృత్తి చేసుకునే పరిస్థితి ఉండటం లేదంది. సరదాగా మాట్లాడుకునే మాటలు సైతం కోర్టు వెలుపల మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉందని, మీరూ అదేపని చేయాలంటూ అటు అడ్వొకేట్‌ జనరల్, ఇటు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. పిటిషనర్లు దోనె సాంబశివరావు తదితరుల న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. అంతర్జాతీయస్థాయి రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చి రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీ నుంచి వెనక్కి వెళుతోందన్నారు.

అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకృతం అయితే మిగిలిన ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్న వాదనను ప్రస్తుత ప్రభుత్వం తెరపైకి తెస్తోందని చెప్పారు. అమరావతి రాజధాని సమీకరణ రైతుసమాఖ్య ఉపాధ్యక్షుడు కళ్లం పానకాలరెడ్డి, మరో ఇద్దరి తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. అమరావతి తమదన్న భావన ప్రజల్లో లేదన్న ప్రభుత్వ వాదన అర్ధరహితమన్నారు. తుగ్లక్, అక్బర్‌లు రాజధానులను మరో చోటుకు మార్చి, ఆ తరువాత తిరిగి పాత నగరాలకే రాజధానులను తీసుకొచ్చారన్నారు. వాదనల అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఆ సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సరదాగా స్పందిస్తూ.. చారిత్రాత్మకంగా తుగ్లక్‌ సమర్థతను ప్రపంచం తక్కువగా అంచనా వేసిందని చెప్పగా, నిజమేనని సీజే నవ్వుతూ బదులిచ్చారు. సరదా మాటలు సైతం పతాక శీర్షికలవుతున్న నేపథ్యంలో ఈ మాటలన్నీ బయట మాట్లాడుకోవాలని సీజే నవ్వుతూ చెప్పారు.  

మరిన్ని వార్తలు