ముద్రణ యూనిట్‌ కార్యకలాపాలు నిలిపేయండి

16 Apr, 2021 09:19 IST|Sakshi

విశాఖలోని ఆమోద పబ్లికేషన్స్‌ (ఆంధ్రజ్యోతి)కి హైకోర్టు ఆదేశం

తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా

సాక్షి, అమరావతి: విశాఖపట్నం, మింది పారిశ్రామిక ప్రాంతంలోని ఏటీఆర్‌ గోడౌన్లలో నడుపుతున్న న్యూస్‌ పేపర్‌ ముద్రణ యూనిట్‌ నిర్వహణ కార్యకలాపాలను నిలిపేయాలని ఆమోద పబ్లికేషన్స్‌(ఆంధ్రజ్యోతి)ను హైకోర్టు ఆదేశించింది. అయితే అక్కడ న్యూస్‌ పేపర్‌ ముద్రణ యంత్ర సామాగ్రి తదితరాలున్న నేపథ్యంలో వాటి రక్షణ కోసం భద్రతను ఏర్పాటు చేసుకోవచ్చునంది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. యూనిట్‌ నిర్వహణ కార్యకలాపాల నిలుపుదల ఉత్తర్వులు అప్పటివరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం, మింది పారిశ్రామిక ప్రాంతంలో ఏపీఐఐసీ కేటాయించిన 18 ఎకరాల స్థలంలో ఏటీఆర్‌ పేరుతో గోడౌన్లు నిర్మించారు.

కేటాయించిన దానికి మించి కొంత స్థలాన్ని ఆక్రమించి గోడౌన్లు కట్టారు. ఏటీఆర్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్స్‌లో ఉషా ట్యూబ్స్‌ అండ్‌ పైప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గోడౌన్‌ నిర్వహిస్తోంది. ఈ సంస్థ నుంచి గోడౌన్‌ను లీజుకు తీసుకున్న ఆమోద పబ్లికేషన్స్‌ అక్కడినుంచి న్యూస్‌ పేపర్‌ ప్రింటింగ్‌ యూనిట్‌ను నిర్వహిస్తోంది. 2020లోనే అధికారులు స్థలం ఆక్రమించి గోడౌన్లు కట్టినట్లు నిర్ధారణకు వచ్చి గోడౌన్‌ యజమానికి నోటీసులిచ్చారు. స్పందించకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్ఫర్మేషన్‌ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు కూడా స్పందించకపోవడంతో చట్టప్రకారం అక్రమంగా నిర్మించిన ప్రహరీల కూల్చివేత చర్యలు చేపట్టారు.

అక్రమంగా నిర్మించిన గోడౌన్‌ నుంచి ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహిస్తున్న ఆమోద పబ్లికేషన్స్‌ కూల్చివేతలపై ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు యథాతథస్థితి (స్టేటస్‌ కో) కొనసాగించాలని ఆదేశాలిచ్చారు. తాజాగా గురువారం ఈ వ్యాజ్యంపై ఆయన విచారణ జరిపారు. ఏపీఐఐసీ తరఫు న్యాయవాది ఉగ్రనరసింహ వాదనలు వినిపిస్తూ.. స్టేటస్‌ కో ఉత్తర్వులకు ఆమోద పబ్లికేషన్‌ వక్రభాష్యం చెబుతోందన్నారు. అంతేగాక స్టేటస్‌ కో ఉత్తర్వులున్నా ప్రింటింగ్‌ ప్రెస్‌ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో స్పష్టమైన ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ నెల 26 వరకు న్యూస్‌ పేపర్‌ ముద్రణ యూనిట్‌ నిర్వహణ కార్యకలాపాలను నిలిపేయాలని ఆమోద పబ్లికేషన్స్‌ను ఆదేశించారు.
చదవండి:
‘మన్యం’ కాఫీ.. రైతు హ్యాపీ  
టీడీపీ మాజీ మంత్రి ఉమకు సీఐడీ నోటీసు

మరిన్ని వార్తలు