‘పూజాదికాల’పై కోర్టులెలా నిర్ణయిస్తాయి?

10 Nov, 2020 04:41 IST|Sakshi

భగవంతుడిని కించపరిచేలా ఈ వ్యాజ్యాలేంటి? 

పిటిషనర్‌పై హైకోర్టు మండిపాటు 

సాక్షి, అమరావతి: ‘తిరుమల శ్రీవారి ఆలయంలో పూజాదికాలను ఎలా నిర్వహించాలో కోర్టులెలా నిర్ణయిస్తాయి? భగవంతుడిని కించపరిచేలా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయడం ఏంటి? ఈ విధంగా ఇతర మతాలపై పిటిషన్లు వేయగలరా? మసీదులో గానీ, చర్చిలో గానీ ఫలానా విధంగా ప్రార్థనలు జరుగుతున్నాయంటూ పిటిషన్‌ వేయగలరా? దేనికైనా పరిమితులు ఉంటాయి. అలాగే సహనం కూడా ఉంటుంది. ఇతరుల మనోభావాల గురించి కనీస ఆలోచన చేయకుండా వ్యాజ్యాలు దాఖలు చేసే పిటిషనర్‌ వంటి వ్యక్తుల వల్లే ఈ దేశంలో సమస్యలు వస్తున్నాయి. ఇతరుల వల్ల ఎలాంటి సమస్యల్లేవు’ అని పిటిషనర్‌ను ఉద్దేశించి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజాదికాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

అలా జోక్యం చేసుకునే పరిధి తమకు ఎంత మాత్రం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుత వ్యాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులివ్వలేమంది. అయితే, టీటీడీ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాత, అవసరమైతే ఈ పిటిషన్‌ వెనుక ఎవరున్నారన్న దానిని తేల్చేందుకు విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమలలో ఆగమశాస్త్రాల ప్రకారం శ్రీవారి పూజాదికాలు జరగడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా హైకోర్టులో ఇటీవల పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై  «సోమవారం మరోసారి విచారణ జరిపిన దర్మాసనం  తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు