నిమ్మగడ్డకు మరో ఎదురుదెబ్బ

17 Mar, 2021 04:08 IST|Sakshi

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల పునరుద్ధరణ ఉత్తర్వులు రద్దు

ఏకగ్రీవమైన అభ్యర్థుల ఎన్నికను ప్రకటించి తీరాలి

ప్రత్యర్థులకు అభ్యంతరాలుంటే ట్రిబ్యునల్‌కు వెళ్లాలి

ఫిర్యాదులపై విచారణాధికారం కమిషన్‌కు లేదు

న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు తీర్పు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కు హైకోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే, ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 18న జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత మొదటిదశ నుంచి విచారణ జరపాలని కలెక్టర్లను ఆదేశించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏపీ పంచాయతీరాజ్‌ ఎన్నికల నిర్వహణ చట్ట నిబంధనల ప్రకారం గత ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల ఎన్నికను ప్రకటించి తీరాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించింది.

ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల ఎన్నికపై వారి ప్రత్యర్థులకు ఏవైనా అభ్యంతరాలుంటే, వారు సంబంధిత ఎన్నికల ట్రిబ్యునల్‌లో ఆ ఎన్నికను సవాలు చేసుకోవచ్చునంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు, ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు ఈ మధ్యలో ఎన్నికలకు సంబంధించి వచ్చే ఏ ఫిర్యాదుపైన కూడా విచారణ జరిపే అధికారం ఏపీ పంచాయతీరాజ్‌ ఎన్నికల నిర్వహణ చట్ట నిబంధనల్లోని రూల్‌ 99 ప్రకారం ఎన్నికల కమిషన్‌కు లేదని తేల్చి చెప్పింది. అదే విధంగా ఎన్నికను రద్దు చేసే అధికారం కూడా ఎన్నికలకు కమిషన్‌కు లేదని స్పష్టం చేసింది. ఎన్నికల్లో మోసం, బెదిరింపులు, బలవంతపు చర్యలు తదితరాలు విచారణ చేయదగ్గవే అయినా కూడా, అందులో జోక్యం చేసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదంది.

ఓసారి ఎన్నిక ముగిసిన తరువాత ఎన్నికలకు సంబంధించిన వివాదాలు, ఫిర్యాదులపై ఎన్నికల ట్రిబ్యునల్‌ మాత్రమే విచారణ జరపాలని చట్టం చెబుతోందని గుర్తుచేసింది. మోసం, బెదిరింపులు, బలవంతపు చర్యలు తదితరాల విషయంలో స్పష్టమైన, నిర్దిష్ట ఆధారాలు ఉండాలంది. ఇలాంటివాటిని న్యాయపరంగా సుశిక్షితులైన న్యాయాధికారి మాత్రమే విచారణ జరపగలరని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు మంగళవారం తీర్పు చెప్పారు. ఎన్నికల కమిషనర్‌ గత నెల 18న జారీచేసిన ఉత్తర్వులతో పాటు బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించి, వాటిని రద్దుచేయాలని కోరుత్తూ ఫారం–10 అందుకున్న పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు గత వారం వాయిదా వేసిన తీర్పును మంగళవారం వెలువరించారు. 

సమాచారం సేకరించవచ్చు
ఎన్నికల ప్రక్రియలో లోపాలను సవరించేందుకు ఎన్నికల అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించవచ్చని, సమాచార సేకరణకు మాత్రమే కమిషన్‌ విచారణను పరిమితం చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికంగా వ్యవహరించని ఎన్నికల అధికారులపై, సిబ్బంది చర్యలు తీసుకునేందుకు సైతం సమాచారం సేకరించవచ్చన్నారు. సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్వీయ అవసరాల నిమిత్తం లేదా చట్ట సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి, శాసనసభకు, పార్లమెంట్‌కు పంపొచ్చని పేర్కొన్నారు. తీర్పు వెలువరించిన తరువాత అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ జోక్యం చేసుకుంటూ, ఈ వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంతో ఎన్నికల కమిషన్‌ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడం లేదని, అందువల్ల ఈ వ్యాజ్యాలు ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాదంటూ ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని కోరారు. అలా చేయడం ద్వారా సమస్యలు వస్తాయన్న న్యాయమూర్తి.. అది ఈ వ్యాజ్యాలతో సంబంధం లేని స్వతంత్ర అంశమని చెప్పారు.

జనసేన పిటిషన్‌పై విచారణ 23కి వాయిదా
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్‌ జారీచేసేలా ఆదేశాలివ్వాలంటూ జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ కోరడంతో న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు విచారణను వాయిదా వేశారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు