చేసిన తప్పుకు సమాజ సేవ చేయండి

15 Jul, 2021 05:07 IST|Sakshi

8 వారాల పాటు అనాథ శరణాలయంలో సంతుష్ట భోజనం పెట్టండి

ధిక్కార కేసులో టీడీపీ నేత మన్నవ సుబ్బారావుతో పాటు మరొకరికి హైకోర్టు వినూత్న శిక్ష 

సాక్షి, అమరావతి: సాధారణంగా కోర్టు ధిక్కార కేసుల్లో జైలు శిక్ష లేదంటే జరిమానా విధిస్తుంటారు. ఈసారి హైకోర్టు ఇందుకు భిన్నంగా వినూత్న తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఇద్దరు ఉద్దేశపూర్వక జాప్యం చేశారని, ఇది ధిక్కారం కిందకే వస్తుందని న్యాయస్థానం తేల్చింది. ఈ నెల 18 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు ప్రతి ఆదివారం విజయవాడ కానూరులోని సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం వృద్ధాశ్రమంలో.. మంగళగిరి, నవులూరు వద్దనున్న షారోన్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే అనాథాశ్రమంలోని వారికి సంతుష్ట భోజనం అందించాలని స్పష్టం చేసింది. అలాగే వారితో కొంత సమయం గడపాలని సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకున్న విషయాన్ని వృద్ధాశ్రమం, అనాథాశ్రమం ఇన్‌చార్జ్‌లు ధ్రువీకరించాలని పేర్కొంది. దానిపై సెప్టెంబర్‌ 19 కల్లా కోర్టు ముందు అఫిడవిట్‌ దాఖలు చేయాలని.. దీన్ని పాటించకపోతే ఆ విషయాన్ని రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌) కోర్టు దృష్టికి తీసుకురావాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టుదేవానంద్‌ బుధవారం తీర్పు వెలువరించారు.

‘కమీషన్‌ ఏజెంట్ల లైసెన్సు రెన్యువల్‌’ ఉల్లంఘన..
గుంటూరు మార్కెట్‌ యార్డ్‌లో మిర్చి అమ్మకాలు చేసే కమీషన్‌ ఏజెంట్ల లైసెన్స్‌ రెన్యువల్‌కు హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాల అమలులో ఉద్దేశపూర్వక జాప్యం చేస్తున్నారంటూ మార్కెట్‌ యార్డ్‌ అప్పటి చైర్మన్, టీడీపీ నేత మన్నవ సుబ్బారావు, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులపై 25 కోర్టు ధిక్కార వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ విచారణ జరిపారు. ప్రతివాదులుగా ఉన్న సుబ్బారావు, శ్రీనివాసరావు బుధవారం హైకోర్టు ముందు హాజరయ్యారు. తమ వయసును పరిగణనలోకి తీసుకోవాలని, కోర్టు ఆదేశాల అమలులో జాగ్రత్తగా వ్యవహరిస్తామని తెలిపారు. బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామన్నారు. సమాజ సేవ చేస్తామంటే.. క్షమాపణలను ఆమోదించడానికి కోర్టు సిద్ధమని న్యాయమూర్తి తెలిపారు. ఇందుకు అంగీకరించడంతో.. వారిని వృద్ధాశ్రమం, అనాధాశ్రమంలో సేవకు ఆదేశాలిస్తూ తీర్పు వెలువరించారు.  

మరిన్ని వార్తలు