కేంద్రం ఇవ్వట్లేదు.. మేమే కొంటున్నాం

28 May, 2021 10:50 IST|Sakshi

బ్లాక్‌ ఫంగస్‌ ఇంజక్షన్లపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదన

సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితుల్లో బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డవారి చికిత్స కోసం వినియోగిస్తున్న ఇంజక్షన్లను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, తామే కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కరోనాకు సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా గురువారం బ్లాక్‌ ఫంగస్‌ గురించి ధర్మాసనం ప్రత్యేకంగా ఆరా తీసింది. చికిత్సకు వాడుతున్న మందులు ఏమిటి? కేంద్రం చేస్తున్న కేటాయింపులు ఎంత? తదితర వివరాలను అడిగింది.

దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి మందులను ఇవ్వడం లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్‌ ఫంగస్‌ మందులను కొనుగోలు చేస్తోందని, ఇప్పటికే ఆర్డర్లు కూడా ఇచ్చామని తెలిపారు. రోజూవారీ పద్ధతిలో మైలాన్‌ నుంచి ఇంజక్షన్లు వస్తున్నాన్నారు. ఇప్పటి వరకు 3,872 ఇంజక్షన్లు వచ్చాయని వివరించారు. అయితే రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు తక్కువగానే ఉన్నాయని, ప్రస్తుత అవసరాలకు అందుబాటులో ఉన్న ఇంజక్షన్లు సరిపోతాయన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ మందులు, ఇంజక్షన్ల కేటాయింపుల విషయంలో వివరాలను తమ ముందుంచాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.

సచివాలయాల్లో అన్ని వివరాలు.. 
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కోవిడ్‌ రోగులు, సంబంధీకులు ఆయా ఆసుపత్రుల్లో బెడ్ల ఖాళీల వివరాలను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లోనే తెలుసుకోవచ్చని వివరించింది. సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్ల ద్వారా బెడ్ల ఖాళీల వివరాలతో పాటు కోవిడ్‌ ఆసుపత్రులు, రోగుల వివరాలు, కోవిడ్‌ పరీక్షా ఫలితాలు కూడా తెలుసుకోవచ్చని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ వివరించారు. సంబంధిత వైద్యాధికారి, ఏఎన్‌ఏం, సమీపంలోని కోవిడ్‌ కేర్‌ కేంద్రం వివరాలు కూడా తెలుసుకునే సౌలభ్యం ఉందన్నారు. ఈ విషయంలో ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ అయినట్లు వివరించారు. కోవిడ్‌ ఆసుపత్రుల్లో బెడ్ల ఖాళీల వివరాలను నోడల్‌ అధికారి ప్రతీ 30 నిమిషాలకొకసారి డ్యాష్‌ బోర్డులో పొందుపరుస్తుంటారని తెలిపారు.

డ్యాష్‌ బోర్డులో నోడల్‌ అధికారులు, ఆసుపత్రుల శాశ్వత ఫోన్‌ నంబర్లను కూడా పొందుపరిచామని, ఫిర్యాదు చేయాలనుకుంటే అందులో నంబర్లు కూడా ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో కోవిడ్‌ కేర్‌ కేంద్రాలను 131కి పెంచామన్నారు. కోవిడ్‌ రోగుల నుంచి ప్రైవేటు ఆసుపత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో బిల్లులపై ప్రతీ ఆసుపత్రిలో ఉండే ప్రభుత్వ నోడల్‌ అధికారి, హెల్ప్‌ డెస్క్‌ మేనేజర్‌ సంతకం ఉండేలా చూడాలని, దీంతో అధిక ఫీజులకు అడ్డుకట్ట వేయవచ్చనిహైకోర్టు ధర్మాసనం చేసిన సూచనపై ప్రభుత్వాన్ని సంప్రదించి తదుపరి విచారణ సమయంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని సుమన్‌ చెప్పారు. బెడ్ల ఖాళీల వివరాలను మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయటాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లతానన్నారు.

పూర్తి వివరాలివ్వాలని ఆదేశం 
రాష్ట్రానికి రోజుకు ఆక్సిజన్‌ సరఫరాను 590 మెట్రిక్‌ టన్నులుగా కేంద్రం నిర్ణయించిందని, దీన్ని పెంచాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేదని సుమన్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తాము చేసిన సూచనలకు సంబంధించిన వివరాలతో పాటు కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ వివరాలు, టీకాలు  , బ్లాక్‌ ఫంగస్‌ మందుల పంపిణీ తదితర అంశాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ దొనడి రమేశ్, జస్టిస్‌ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు సంబంధించి హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై హైకోర్టు ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. కరోనా విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ మెమో రూపంలో ధర్మాసనం ముందుంచారు.

జాతీయ టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షిస్తోంది.. 
ప్రస్తుతం రాష్ట్రానికి రోజూ సగటున 680 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా అవుతోందన్నారు. ప్రస్తుత అవసరాలకు ఇది సరిపోతుందని తెలిపారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో కొందరు ఆక్సిజన్‌ సరఫరా విషయంలో కేంద్రం తగిన రీతిలో స్పందించడం లేదని నివేదించారు. దీనిపై కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌  హరినాథ్‌ స్పందిస్తూ ఆక్సిజన్‌ కేటాయింపులతో కేంద్రానికి సంబంధం లేదని, జాతీయ టాస్క్‌ఫోర్స్‌ చూసుకుంటోందని, మరింత ఆక్సిజన్‌ కావాలంటే జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను సంప్రదించాల్సి ఉంటుందన్నారు.  ధర్మాసనం స్పందిస్తూ, జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను అడిగేందుకు ఏమైనా ఇబ్బంది ఉందా? అని సుమన్‌ను అడిగింది. ఎలాంటి ఇబ్బంది లేదని, ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌కు పలు లేఖలు రాశామని, వాటిని కోర్టు ముందుంచుతానని చెప్పారు.

వ్యాక్సినేషన్‌ వివరాలు ఇవ్వండి.. 
చివరగా వ్యాక్సినేషన్‌ అంశం చర్చకు రాగా 45 సంవత్సరాలు, ఆపైబడిన వారికి ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తోందని సుమన్‌ చెప్పారు. అయితే టీకాల విషయంలో కేంద్రం నియంత్రణ విధిస్తోందన్నారు. వ్యాక్సిన్ల కొరత వల్ల 18 ఏళ్లకు పైబడిన వారికి ఇవ్వలేకపోతున్నామన్నారు. వ్యాక్సిన్ల కొనుగోలు నిమిత్తం కంపెనీలకు డబ్బులు కూడా చెల్లించేశామని తెలిపారు. 13 లక్షల వయల్స్‌ కోవిషీల్డ్, 3 లక్షల కోవాగ్జిన్‌ వయల్స్‌ కొనుగోలుకు డబ్బులు చెల్లించామన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

సరిపడా రెమిడిసివిర్‌ ఇంజక్షన్లు.. 
రాష్ట్రంలో రెమిడిసివిర్‌ ఇంజక్షన్లకు కొరత లేదని సుమన్‌ తెలిపారు. ప్రభుత్వం వద్ద గురువారం నాటికి 72,718 ఇంజక్షన్లు ఉన్నాయని చెప్పారు. రోజూ వారీ పద్ధ్దతిలో ఇంజక్షన్లు అందుతున్నాయన్నారు. ప్రస్తుత అవసరాలకు ఇవి సరిపోతాయన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన వి.అశోక్‌రామ్‌ స్పందిస్తూ, రెమిడిసివిర్‌ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. కేసులు తక్కువ ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు ఎక్కువ  ఇస్తూ, కేసులు ఎక్కువగా ఉన్న ఏపీకి తక్కువ ఇస్తోందన్నారు. ఈ సమయంలో ఏఎస్‌జీ హరినాథ్‌ జోక్యం చేసుకుంటూ.. కేసుల సంఖ్యను బట్టి కాదని, తీవ్రతను బట్టి కేటాయింపు ఉంటుందన్నారు. రేట్ల సంగతేంటని ధర్మాసనం ప్రశ్నించగా, ప్రభుత్వం తక్కువ రేట్లకు ఇస్తోందని సుమన్‌ తెలిపారు. అధిక రేట్లకు విక్రయించే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

చదవండి: యాస్‌ బలహీనం: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలే   
ఆనందయ్య మందు: కీలక దశకు ప్రయోగాలు

మరిన్ని వార్తలు