అమరావతి యాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

21 Oct, 2022 03:22 IST|Sakshi

పాదయాత్రలో రైతులే ఉండాలి 

వేల మంది ఎలా పాల్గొంటారు?

ఇతరులు సంఘీభావం తెలపొచ్చు 

ఆ పేరుతో యాత్రలో పాల్గొనరాదు

రోప్‌ పార్టీకి పోలీసులను ఆదేశిస్తాం 

మా ఆదేశాలకు లోబడే యాత్ర జరగాలి

ఎలాంటి ఆదేశాలు కావాలో చెప్పండి 

ఇరుపక్షాలకు హైకోర్టు ఆదేశం.. 

నేడు మళ్లీ విచారణ

అడుగడుగునా కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు 

ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు 

తొడలు కొడుతూ రెచ్చగొడుతున్నారు.. వీడియోలు మీరే చూడండి 

హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్‌

అనుబంధ పిటిషన్‌ దాఖలుకు అనుమతినిచ్చిన హైకోర్టు 

సాక్షి, అమరావతి: రైతుల పేరుతో అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన మహా పాదయాత్రను టీడీపీ మద్దతుతో నిర్వాహకులు రాజకీయ యాత్రగా మార్చిన నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ఆదేశాలకు లోబడే మహా పాదయాత్ర జరగాలని తేల్చి చెప్పింది. 600 మంది రైతులు మాత్రమే యాత్రలో పాల్గొనేందుకు తాము అనుమతినిచ్చిన సంగతి గుర్తు చేసింది. అందుకు విరుద్ధంగా 600 మందికి మించి పాల్గొనడానికి వీల్లేదని ప్రాథమికంగా తేల్చిచెప్పింది. అది కూడా యాత్రలో రైతులు మాత్రమే పాల్గొనాలని తేల్చి చెప్పింది.

రైతులు మినహా మిగిలిన వారెవరూ పాల్గొనకుండా రోప్‌ పార్టీతో తగిన చర్యలు చేపట్టేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించింది. సంఘీభావం పేరుతో మిగిలిన వారు యాత్రలో పాల్గొనడానికి వీల్లేదని పేర్కొంది. తమ ఆదేశాల వల్లే పాదయాత్ర చేస్తున్నారని గుర్తు చేసిన హైకోర్టు, ఆ యాత్ర కొనసాగాలంటే వాటిని అమలు చేయాల్సిందేనని తెలిపింది. రూట్‌మ్యాప్‌ ప్రకారం యాత్ర జరిగేచోట అదేరోజు ఇతర పార్టీలు ఎలాంటి పోటీ కార్యక్రమాలు చేపట్టకుండా ఆదేశాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామంది.

కోర్టు ఆదేశాలకు లోబడి యాత్ర సాగేందుకు ఎలాంటి ఆదేశాలు కావాలో తెలియచేయాలని అటు పిటిషనర్‌ను, ఇటు పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు, మరో ఇద్దరు లంచ్‌మోషన్‌ రూపంలో దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.

సీఎం, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు..
విచారణ సందర్భంగా హోంశాఖ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ హైకోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్నవారు అడుగడుగునా న్యాయస్థానం విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని నివేదించారు. యాత్ర సందర్భంగా ప్రభుత్వంపై, ప్రభుత్వ పెద్దలపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని కోర్టు ఆదేశించినా ఖాతరు చేయకుండా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు.

యాత్ర చేస్తున్న వారు తొడలు కొడుతూ రెచ్చగొడుతున్నారన్నారు. యాత్రలో పాల్గొనేందుకు హైకోర్టు 600 మందికే అనుమతినిస్తే రోజూ వేల సంఖ్యలో పాల్గొంటున్నారని, వీరిలో టీడీపీ నేతలు, కార్యకర్తలే ఉన్నారని తెలిపారు. సంఘీభావం పేరుతో ఏం చేస్తున్నారన్నదే ముఖ్యమన్నారు. యాత్రలో ఎవరెవరు పాల్గొంటున్నారో ఫొటోలు చూస్తే అర్థమవుతుందన్నారు. అభ్యంతరకర నినాదాలు చేయడం, రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లే రాజమహేంద్రవరం ఘటన జరిగిందని, ఇందుకు నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

ఈ నేపథ్యంలో యాత్ర క్షేత్రస్థాయిలో ఎలా సాగుతోంది? నిర్వాహకులు కోర్టు ఆదేశాలను ఎలా ఉల్లంఘిస్తున్నారు? టీడీపీ నాయకులు సంఘీభావం పేరుతో ఏం చేస్తున్నారు? తదితర అంశాలతో  అనుబంధ పిటిషన్‌ను సిద్ధం చేశామన్నారు. పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని అందులో కోరామని, ఆ పిటిషన్‌ను పరిశీలించిన తరువాత తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏజీ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు అనుబంధ పిటిషన్‌ దాఖలుకు అనుమతినిచ్చింది. 

ఎలా అడ్డుకోగలం?.. ఉద్రేకం వద్దు!
సాధారణ ప్రజానీకం తమ యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారని, వారిని ఎలా అడ్డుకోగలమని ఉన్నం మురళీధరరావు పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవడం లేదన్నారు. అమరావతి రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మురళీధరరావు ఆవేశంగా వాదనలు వినిపిస్తుండటంతో.. ఉద్రేకం తగ్గించుకోవాలని న్యాయమూర్తి ఆయనకు సూచించారు.

600 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని హైకోర్టు స్పష్టంగా చెబితే అందుకు విరుద్ధంగా వేల సంఖ్యలో ఎలా పాల్గొంటారని న్యాయమూర్తి ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేందుకు రావడంలో తప్పు లేకున్నా ఆ పేరుతో యాత్రలో పాల్గొంటామంటే అది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. యాత్ర విషయంలో కోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని న్యాయమూర్తి గుర్తు చేశారు. తమ ఆదేశాలకు లోబడే యాత్ర సాగాల్సి ఉంటుందని తేల్చి చెబుతూ విచారణను నేటికి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఈ మొత్తం వ్యవహారంలో హోంశాఖ కౌంటర్‌ సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు