ప్రైవేట్‌ ఆస్పత్రులను మీ అజమాయిషీలోకి తీసుకోండి

18 May, 2021 05:52 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా

సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితులకు తగిన చికిత్స అందించేందుకు వీలుగా ప్రైవేట్‌ ఆస్పత్రులను తన అజమాయిషీలోకి తీసుకునే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని హైకోర్టు కోరింది. దీనివల్ల చాలా మందికి చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. రోగులకు బెడ్ల ఖాళీల వివరాలను తెలిపేందుకు నిర్దిష్ట సమాచార వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలంది. ప్రస్తుతం ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌ 104తో పాటు మరో నంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలంది. అలాగే హెల్త్‌ బులెటిన్‌ను కూడా విడుదల చేయాలంది. వ్యాక్సిన్‌ వేసేటప్పుడు కోవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ విషయంలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్, జస్టిస్‌ కన్నెగంటి లలిత ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌కు సంబంధించి దాఖలైన పలు పిల్‌లపై ధర్మాసనం విచారణ జరిపింది. 

కర్ఫ్యూ సత్ఫలితాలిస్తోంది..: ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. కరోనాను అడ్డుకోవడంలో కర్ఫ్యూ సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. కేంద్రం నుంచి తగిన సంఖ్యలో వ్యాక్సిన్లు, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు రాష్ట్రానికి రావడం లేదన్నారు. 2.35 లక్షల వయల్స్‌ పంపుతామన్న కేంద్రం కేవలం 95 వేల వయల్స్‌ మాత్రమే పంపిందని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రెమ్‌డెసివిర్‌ కొనుగోలు చేస్తోందని, దీంతో ఎలాంటి కొరత ఉండడం లేదన్నారు. మరింత మంది రోగులకు చికిత్స అందించడానికి కోవిడ్‌ ఆస్పత్రులను 650 నుంచి 680కి పెంచామన్నారు. అధిక ఫీజులు గుంజుతున్న ఆస్పత్రులపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. రోగుల పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్‌ అంబులెన్సులపై చర్యలు తీసుకోవడంతోపాటు వాటిని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ స్పందిస్తూ.. ఆక్సిజన్‌ హేతుబద్ద సరఫరా కోసం జాతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఏపీకి ప్రస్తుతం 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నామని తెలిపారు.  

మరిన్ని వార్తలు