ప్రభుత్వ ధరలకే సినిమా టికెట్లు అమ్మాలి

11 Apr, 2021 04:14 IST|Sakshi

నేటి నుంచి అమలు చేయాలని థియేటర్ల యాజమాన్యాలకు హైకోర్టు ఆదేశం

అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకోవచ్చని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: ప్రభుత్వ జీవోలోని ధరల ప్రకారమే ఆదివారం నుంచి సినిమా టికెట్లు అమ్మాలని థియేటర్ల యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అధిక ధరలు వసూలు చేస్తే ఆయా థియేటర్ల యాజమాన్యాలపై అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. శనివారం(10వ తేదీ) వరకు అడ్వాన్స్‌ బుకింగ్‌లో ఇచ్చిన టికెట్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు సూచించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులిచ్చింది. వకీల్‌సాబ్‌ సినిమాకు మొదటి మూడు రోజుల పాటు టికెట్‌ ధరలు పెంచుకోవచ్చన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేసింది.

హోం శాఖ ముఖ్య కార్యదర్శి హౌస్‌ మోషన్‌ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. సినీ ప్రేక్షకుల నుంచి అధిక రేట్లు వసూలు చేయకుండా ఉండేందుకే కొత్త మార్గదర్శకాలతో జీవో ఇచ్చినట్లు తెలిపారు. మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా.. సింగిల్‌ జడ్జి మాత్రం కేవలం అడ్వాన్స్‌ బుకింగ్‌లో ఇచ్చిన టికెట్లు మాత్రమే కాకుండా మూడు రోజుల పాటు అన్ని రకాల టికెట్లను అధిక ధరలకు అమ్ముకునేందుకు అనుమతిచ్చారని వివరించారు.

థియేటర్ల యాజమాన్యాల తరఫు న్యాయవాది కె. దుర్గా ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. దీనివల్ల థియేటర్ల యజమానులు నష్టపోతున్నారని వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ఆదివారం నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని స్పష్టం చేసింది.   

>
మరిన్ని వార్తలు