అంతా మీ ఇష్టమేనా?

11 Nov, 2020 03:23 IST|Sakshi

పోలీసులపై పిటిషన్ల ఉపసంహరణ పట్ల హైకోర్టు అభ్యంతరం

తొలుత నిరాకరణ.. తరువాత అనుమతి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందన్న ప్రాథమిక అభిప్రాయంతో గత కొద్ది రోజులుగా పలు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై విచారణ జరుపుతున్న హైకోర్టు.. పోలీసులపై ఆరోపణలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలను పిటిషనర్లు తాజాగా ఉపసంహరించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషన్లు అలా ఎలా ఉపసంహరించుకుంటారని ప్రశ్నించింది. అంతా మీష్టమేనా? అని పిటిషనర్లను ప్రశ్నిస్తూ అవసరమైతే దీనిపై విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది.

ఇలా ఆరోపణలు చేయడం, ఆ తరువాత ఉపసంహరించుకుంటామంటే దాని అర్థం ఏమిటని అడిగింది. న్యాయస్థానం ఓ దశలో పిటిషన్ల ఉపసంహరణ వినతికి ససేమిరా అంది. అయితే తమ వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటామని పిటిషనర్లు తేల్చి చెప్పడంతో చివరకు అందుకు అనుమతినిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే ఇలా ఉపసంహరించుకున్న వ్యాజ్యాలన్నిటినీ రికార్డుల్లోనే ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.  

మరిన్ని వార్తలు