ఆ ఇద్దరికీ కరోనా పరీక్షలు చేయించండి

6 May, 2021 04:41 IST|Sakshi

ఏసీబీ, జైలు అధికారులకు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి/కంబాలచెరువు(రాజమహేంద్రవరం) : సంగం డెయిరీ అక్రమాల వ్యవహారంలో అరెస్టయిన టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, సహకార శాఖ మాజీ అధికారి గురునాథంను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయించాలని హైకోర్టు బుధవారం ఏసీబీ, రాజమండ్రి జైలు అధికారులను ఆదేశించింది. ఒకవేళ వారికి కోవిడ్‌ నిర్ధారణ అయితే ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించాలని స్పష్టం చేసింది.  ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.

సంగం డెయిరీ అక్రమాలకు సంబంధించి ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఎండీ గోపాలకృష్ణన్‌  హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ రఘునందన్‌రావు బుధవారం విచారణ జరిపారు.ఏసీబీ తరఫు న్యాయవాది గాయత్రీరెడ్డి వాదనలు వినిపిస్తూ..   దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని, అందువల్ల విచా రణను వేసవి సెలవుల తరువాత చేపట్టాలని అభ్యర్థించారు. ధూళిపాళ్ల  తరఫు న్యాయవాది  దుర్గాప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ఎండీ గోపాలకృష్ణన్‌కు కరోనా సోకిందన్నారు. మిగిలిన ఇద్దరు కూడా జైల్లో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. 

ఆయుష్‌కు గోపాలకృష్ణన్‌ తరలింపు..
సంగం డెయిరీ అక్రమాల కేసు ఏ2 నిందితుడు గోపాలకృష్ణన్‌ను వైద్య చికిత్సల నిమిత్తం విజయవాడలోని ఆయుష్‌కి తరలించామని సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. ఆయన ‘వైరల్‌ బ్రాంకో న్యూమోనియా’తో బాధపడుతున్నట్లు తెలిపారని చెప్పారు.     

మరిన్ని వార్తలు