పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించొద్దు

25 Jul, 2021 03:10 IST|Sakshi

పునరావాస ప్యాకేజీ అమలు, నిర్వాసితుల హక్కుల పరిరక్షణకు ఏం చేస్తున్నారో చెప్పండి

ప్రభుత్వాధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులుగా మారుతున్న వారికి చట్ట ప్రకారం పునరావాసం కల్పించకుండా ఆయా గ్రామాల నుంచి వారిని ఖాళీ చేయించవద్దని హైకోర్టు శనివారం అధికారులను ఆదేశించింది. నిర్వాసితుల హక్కుల పరిరక్షణ, పునరావాసం ప్యాకేజీ అమలు, దాని పర్యవేక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయంలో ప్రభుత్వం చట్ట ప్రకారం నడుచుకోవడం లేదని, నిర్వాసితులను వారి గ్రామాల నుంచి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ స్వచ్ఛంద సంస్థ ‘శక్తి’ డైరెక్టర్‌ డాక్టర్‌ శివరామకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం శనివారం మరోసారి విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ, నిర్వాసితుల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పోలవరం కాఫర్‌ డ్యామ్‌లో నీటిని నిల్వ చేసి, నీరు గ్రామాల్లోకి వచ్చేలా చేస్తున్నారని, దీంతో ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయేలా పరిస్థితులు సృష్టిస్తున్నారని వివరించారు. గిరిజనులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించలేదన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని తెలిపారు. ఈ విషయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సరిగా స్పందించడం లేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, నిర్వాసితులకు చట్ట ప్రకారం తగిన పునరావాసం కల్పించకుండా వారిని ఆయా గ్రామాల నుంచి ఖాళీ చేయించవద్దని అధికారులను ఆదేశించింది.  

మరిన్ని వార్తలు