ఇదేం కారుణ్యం.. పెళ్లైన కుమార్తెపై వివక్ష ఎందుకు?

7 Mar, 2021 04:07 IST|Sakshi

ఇది రాజ్యాంగ విరుద్ధం.. ఈ నిబంధనను రద్దు చేస్తున్నాం

పెళ్లి అయిన కుమార్తె కూడా కారుణ్య నియామకానికి అర్హురాలే

పిటిషనర్‌ దమయంతి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోండి

ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత.. అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇచ్చే కారుణ్య నియామక ఉద్యోగానికి వివాహిత అయిన కుమార్తె కూడా అర్హురాలేనంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కారుణ్య నియామకానికి ‘అవివాహిత’ మాత్రమే అర్హురాలన్న ఏపీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం నిబంధనను హైకోర్టు రద్దు చేసింది. ఆ నిబంధనను రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, ఏకపక్ష నిర్ణయంగా ప్రకటించింది.

పెళ్లి అయ్యిందన్న కారణంతో దమయంతి అనే మహిళకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వలేమంటూ ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు రద్దు చేసింది. తండ్రి మరణించిన నేపథ్యంలో తోబుట్టువులు ఎవరూ లేని, భర్తకు శాశ్వత ఆదాయమంటూ ఏదీ లేని పరిస్థితుల్లో కారుణ్య నియామకం కోసం దమయంతి చేస్తున్న అభ్యర్థనను ‘బ్రెడ్‌ విన్నర్‌ స్కీం’ కింద 6 వారాల్లో పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల తీర్పు వెలువరించారు.

కుమార్తెల విషయంలో వివక్ష ఎందుకు?
ఆర్టీసీ తరఫు న్యాయవాది శ్రీహరి వాదనలు వినిపిస్తూ.. ‘బ్రెడ్‌ విన్నర్‌ స్కీం’ నిబంధనల కింద మృతుడి భార్య లేదా కుమారుడు, అవివాహిత కుమార్తెల్లో ఒక్కరు మాత్రమే కారుణ్య నియామకానికి అర్హులని తెలిపారు. దమయంతికి పెళ్లి అయినందున ఆమె దరఖాస్తును నిబంధనల ప్రకారం తిరస్కరించామని చెప్పారు. ఈ వాదనతో న్యాయమూర్తి విబేధించారు. ‘ప్రభుత్వం 1999లో జారీ చేసిన జీవో 350 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు అతని భార్య కారుణ్య నియామకానికి ముందుకు రాకపోతే.. ఆ ఉద్యోగికి ఒకే కుమార్తె ఉండి.. ఆమెకు వివాహమైనా కూడా కారుణ్య నియామకానికి పరిగణనలోకి తీసుకోవచ్చు. 2003లో దీనికి సంబంధించి ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసింది. అయితే 2000వ సంవత్సరంలో ఆర్టీసీ యాజమాన్యం జారీ చేసిన అర్హత నిబంధనల్లో మాత్రం మృతుడి భార్య, కుమారుడు, అవివాహిత కుమార్తెల్లో ఒకరు మాత్రమే కారుణ్య నియామకానికి అర్హులుగా పేర్కొన్నారు.

నిబంధనల పేరుతో పెళ్లి అయిన కుమార్తెలపై వివక్ష చూపుతున్నారు. ఇది చట్ట విరుద్ధం. ఆర్టీసీ నిబంధనలను పరిశీలిస్తే.. కుమారుడికి పెళ్‌లైనా, పెళ్లి కాకపోయినా కారుణ్య నియామకానికి అర్హుడే. కానీ కుమార్తె మాత్రం అనర్హులంటూ వివక్ష చూపిస్తున్నారు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘కొడుకు, కుమార్తెలకు పెళ్లి అయినా, కాకున్నా.. తల్లిదండ్రుల కుటుంబంలో వాళ్లు భాగమే. పెళ్లి అయినంత మాత్రాన కుమార్తె తన తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలి హోదాను కోల్పోదు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంది’ అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ‘ఈ కేసులో పిటిషనర్‌ దమయంతి ఒక్కరే కుమార్తె. తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. ‘బ్రెడ్‌ విన్నర్‌ స్కీం’ కింద కారుణ్య నియామకానికి దమయంతి అర్హురాలే..’ అని న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ తన తీర్పులో స్పష్టం చేశారు.  

ఇదీ వివాదం..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీహెచ్‌ పెంటయ్య ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ 2009లో మరణించారు. భార్య చిన్నమ్మడు, కుమార్తె దమయంతి ఉన్నారు. అయితే దమయంతికి, ఆమె భర్తకు శాశ్వత ఆదాయమేదీ లేదు. ఈ నేపథ్యంలో తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగమివ్వాలంటూ చిన్నమ్మడు ఆర్టీసీ యాజమాన్యానికి దరఖాస్తు చేసుకున్నారు. కండక్టర్‌ లేదా శ్రామిక్‌ పోస్టుకు అవసరమైన అర్హతలు లేవంటూ ఆమె దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీంతో కుమార్తె దమయంతి దరఖాస్తు చేసుకుంది. ఇందుకు చిన్నమ్మడు కూడా నిరభ్యంతర పత్రమిచ్చారు.

కానీ ఆర్టీసీ అధికారులు.. కారుణ్య నియామకాలపై ప్రభుత్వ నిషేధముందంటూ దమయంతి దరఖాస్తును పక్కన పెట్టారు. దీనిపై ఆమె 2014లో హైకోర్టును ఆశ్రయించారు. దమయంతి దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు అప్పట్లో ఆదేశించింది. కానీ పెళ్లి అయ్యిందన్న కారణంతో దమయంతి దరఖాస్తును ఆర్టీసీ అధికారులు తిరస్కరిస్తూ 2014లో ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. దీంతో దమయంతి అదే ఏడాది మరోసారి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల తుది విచారణ జరిపారు.  

మరిన్ని వార్తలు