ఆనందయ్య మందుపై  త్వరగా నిర్ణయం తీసుకోండి

28 May, 2021 04:07 IST|Sakshi

ఈ ఔషధంపై పూర్తి వివరాలు సమర్పించండి

కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

అధికారులు వేధిస్తున్నారంటూ ఆనందయ్య పిటిషన్‌ 

సాక్షి, అమరావతి: ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య తయారుచేస్తున్న ఔషధం పంపిణీ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆనందయ్య ఔషధంపై పరీక్షలు చేస్తున్నామంటూ జాప్యం చేయడం సరికాదంది. ఆనందయ్య ఔషధం తయారీ, దానికి అనుమతులు, పంపిణీ తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ దొనడి రమేశ్, జస్టిస్‌ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణ పట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న కోవి డ్‌ మందు పంపిణీలో జోక్యం చేసుకోకుండా అధికా రుల ను ఆదేశించాలని, ఆ మందు పంపిణీకి తక్షణమే అనుమ తులిచ్చేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది పి.మల్లి కార్జునరావు, ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై గురువారం జస్టిస్‌ రమేశ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ జోక్యం చేసుకుంటూ.. ఆనందయ్య మందు నమూనాలను ఆయుష్‌ విభాగం ల్యాబ్‌కు పంపిందని, ఈ నెల 29న నివేదిక అందుతుందని చెప్పారు. ఈ మందు ప్రజా వినియోగానికి అనువైనదని తేలితే పంపిణీకి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.  

కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం తయారీదారు దరఖాస్తు చేసుకుంటే ఆ ఔషధాన్ని పరీక్షించి, ప్రజా వినియోగానికి యోగ్యమైనదిగా భావిస్తే పంపిణీకి అనుమతినిస్తామని చెప్పారు. ఆనందయ్య మందువల్ల దుష్ప్రభావాలు లేవని మీడియాలో ప్రచారమే తప్ప అధికారిక నివేదిక ఏదీ లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. సాంకేతిక అంశాల జోలికి వెళ్లొదని స్పష్టం చేసింది. ఆనందయ్య ఔషధానికి ఎవరు అనుమతులు ఇవ్వాలి? ఆ మందును ప్రజలకు ఇవ్వొచ్చా? లేదా? అన్న విషయాలను తదుపరి విచారణలో తమముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

ఫార్ములా చెప్పాలని అధికారులు బెదిరిస్తున్నారు
మరోవైపు.. తన ఔషధంలో ఉపయోగించే పదార్థాలు, ఫార్ములా చెప్పాలని నెల్లూరు జిల్లా అధికారులు బెదిరిస్తున్నారని కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని, తనకు భద్రత కూడా కల్పించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్‌ రమేశ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణను కూడా ధర్మాసనం ఈ నెల 31కి వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు