న్యాయమూర్తులపై పోస్టులను తొలగించండి

7 Oct, 2020 05:28 IST|Sakshi

సోషల్‌ మీడియా కంపెనీలకు హైకోర్టు ఆదేశం 

సవరణ పిటిషన్‌పై ప్రభుత్వ కౌంటర్‌ దాఖలుకు ఆదేశం 

విచారణ రేపటికి వాయిదా 

సాక్షి, అమరావతి: న్యాయమూర్తులపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులను చట్ట ప్రకారం తొలగించాలని హైకోర్టు మంగళవారం ఆయా సామాజిక మాధ్యమ కంపెనీలను ఆదేశించింది. ఆ పోస్టులకు సంబంధించిన యూఆర్‌ఎల్‌ను ఆయా కంపెనీలకు అందచేయాలని సీఐడీకి సూచించింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ దాఖలు చేసిన సవరణ పిటిషన్‌కు బుధవారానికల్లా కౌంటర్‌ దాఖలు చేయాలని ఏజీ శ్రీరాంను ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిచ్చిన తరువాత న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు, పోస్టులు వచ్చాయి. వీటిపై హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఫిర్యాదు చేయడంతో ఏడుగురిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుల్లో పురోగతి లేదని, సామాజిక మాధ్యమ కంపెనీలైన ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్‌ వంటి వాటిపై చర్యలు తీసుకోవడంలో సీఐడీ అధికారులు విఫలమయ్యారంటూ హైకోర్టు తరఫున రిజిస్ట్రార్‌ జనరల్‌ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. హైకోర్టు తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వినీకుమార్‌ మాట్లాడుతూ ప్రధాన పిటిషన్‌లో అదనంగా కొన్ని అంశాలను చేరుస్తూ సవరణ పిటిషన్‌ వేశామని చెప్పారు. అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం స్పందిస్తూ కౌంటర్‌ దాఖలుకు గడువివ్వాలని కోరారు.

సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి.. దర్యాప్తు వివరాలతో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేశామని,  రిమాండ్‌ రిపోర్ట్‌తో పాటు ఇతర వివరాలను సీల్డ్‌ కవర్‌లో కోర్టు ముందుంచామని చెప్పారు. సోషల్‌ మీడియా కంపెనీల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం.. సామాజిక మాధ్యమాల్లో ఉన్న పోస్టులను తొలగించేందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ కంపెనీలను ఆదేశించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన తెలుగుదేశం నేత శివానందరెడ్డి తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు మాట్లాడుతూ.. న్యాయమూర్తులపై కుట్ర జరుగుతోందని, ఆ వివరాలను తెలిపేందుకే ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశామని చెప్పారు. ఈ ఇంప్లీడ్‌ పిటిషన్‌పై తదుపరి విచారణలో చూస్తామని పేర్కొంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.   

>
మరిన్ని వార్తలు