కోర్టు ధిక్కరణ కేసు.. సాయంత్రం వరకు కోర్టులో నిలబడండి: ఏపీ హైకోర్టు

19 Jan, 2023 07:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కారం కేసులో హైకోర్టులో బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో అలసత్వం ప్రదర్శించినందుకు పాఠశాల విద్యాశాఖ గత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఇంటర్మీడియెట్‌ విద్య గత కమిషనర్‌ వి.రామకృష్ణకు సింగిల్‌ జడ్జి జైలు శిక్ష విధించడం, వారు క్షమాపణలు కోరడంతో జైలుశిక్ష ఉత్తర్వులను సవరించి కోర్టు పని గంటలు ముగిసే వరకు కోర్టులోనే ఉండాలని ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలను ధర్మాసనం నిలుపుదల చేయడం చకచకా జరిగిపోయాయి.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా వీఈసీ జూనియర్‌ కాలేజీలో పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేస్తున్న సాంబశివరావు సర్వీసును క్రమబద్ధీకరించాలని న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ 2020లో ఆదేశాలు జారీ చేయగా.. అప్పటి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, అప్పటి ఇంటర్మీడియెట్‌ విద్య కమిషనర్‌ రామకృష్ణ అమలు చేయలేదు. దీంతో వారిద్దరిపైనా సాంబశివరావు కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్‌ దేవానంద్‌ ఇరువురు అధికారులు ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాల అమలులో జాప్యం చేశారని ప్రాథమికంగా తేల్చారు.

శిక్ష విధించేందుకు వీలుగా వారిద్దరినీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ, రాజశేఖర్‌ బుధవారం కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించగా.. వారు క్షమాపణలు తెలిపారు. ఈ క్షమాపణలు సదుద్దేశంతో చెప్పడం లేదంటూ.. ఇరువురికీ నెల రోజుల చొప్పున జైలుశిక్ష, చెరో రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైకోర్టు అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రభుత్వ న్యాయవాది రఘువీర్‌ స్పందిస్తూ.. జైలు శిక్ష ఆదేశాల అమలును రెండు రోజులపాటు నిలుపుదల చేయాలని అభ్యర్థించగా.. న్యాయమూర్తి తోసిపుచ్చారు.

కోర్టు హాలులోనే ఉన్న ఇరువురు అధికారులు మరోసారి బేషరతు క్షమాపణలు తెలపడంతో వారి వయసు, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ దేవానంద్‌ వారికి విధించిన జైలు శిక్షను సవరించారు. కోర్టు పనివేళలు ముగిసేంత వరకు కోర్టు హాలులో ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. జరిమానా మాత్రం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, సింగిల్‌ జడ్జి జస్టిస్‌ దేవానంద్‌ ఇచ్చిన ఆదేశాలపై ఇరువురు అధికారులు ధర్మాసనం ముందు వేర్వేరుగా కోర్టు ధిక్కార అప్పీళ్లు దాఖలు చేయగా.. న్యాయమూర్తులు జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి ధర్మాసనం అత్యవసర విచారణకు అంగీకరించింది. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

చదవండి: (రెవెన్యూశాఖలో కలకలం.. ముగ్గురు తహసీల్దార్ల సస్పెన్షన్‌)

మరిన్ని వార్తలు