నరేంద్ర తదితరుల విచారణకు ఏసీబీకి హైకోర్టు అనుమతి

4 May, 2021 05:17 IST|Sakshi

సాక్షి అమరావతి: సంగం డెయిరీ అక్రమాలకు సంబంధించి టీడీపీ సీనియర్‌ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణన్, సహకారశాఖ మాజీ ఉద్యోగి గురునాథంలను ఏసీబీ అధికారులు ప్రశ్నించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపటినుంచి నరేంద్రను 3 రోజులు, గోపాలకృష్ణన్‌ను రెండురోజులు, గురునాథంను ఒకరోజు విచారించవచ్చని ఏసీబీ అధికారులకు తెలిపింది. కోవిడ్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని రాజమండ్రి కేంద్ర కారాగారంలోనే విచారించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ధూళిపాళ్ల నరేంద్ర తదితరులను సంగం అక్రమాల కేసులో విచారించాల్సి ఉందని, అందువల్ల వారిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏసీబీ కోర్టు నరేంద్ర తదితరులను 5 రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నరేంద్ర తదితరులు హైకోర్టులో శనివారం హౌస్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి.. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. సోమవారం విచారణ జరిపిన న్యాయమూర్తి.. ధూళిపాళ్ల తదితరుల విచారణకు ఏసీబీకి అనుమతి ఇచ్చారు.

జీవో 19పై ముగిసిన వాదనలు 
మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వాయిదా
సంగం డెయిరీ నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో 19ని సవాలు చేస్తూ సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ధర్మారావు దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు నిన్న న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. అంతకుముందు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. చట్టప్రకారమే జీవో ఇచ్చామన్నారు. షరతులకు అనుగుణంగా నడుచుకోకుండా, నిబంధనలను ఉల్లంఘించినందునే సంగం డెయిరీ నిర్వహణ బాధ్యతలను పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తెచ్చినట్లు చెప్పారు. దీనివల్ల పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

నిబంధనలకు విరుద్దంగా 10 ఎకరాల భూమిని ఆస్పత్రి నిర్మాణం నిమిత్తం ట్రస్ట్‌కు బదిలీ చేశారని తెలిపారు. డెయిరీ విషయంలో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయన్నారు. అన్నీ నిబంధనల ప్రకారమే చేశామని, మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని చెప్పారు. అంతకుముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. సంగం డెయిరీని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. స్వాధీన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.  

మరిన్ని వార్తలు