నంద్యాల మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి హైకోర్టు అనుమతి

23 Jul, 2022 13:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: నంద్యాలలో వైద్య కళాశాల భవన నిర్మాణం చేపట్టేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య కళాశాల ఏర్పాటు నిమిత్తం నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూమిని ప్రభుత్వానికి బదలాయించడాన్ని సవాల్‌ చేస్తూ కర్నూలుకు చెందిన రైతులు బొజ్జా దశరథరామిరెడ్డి, మరో నలుగురు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మరిన్ని వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. 

ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనే వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంటూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కు దరఖాస్తు సమర్పించామన్నారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి భవన నిర్మాణం చేపట్టకపోతే వైద్య కళాశాల అనుమతులు రద్దవుతాయన్నారు. అంతేకాక అమూల్యమైన విద్యా సంవత్సరం వృథా అవుతుందని వివరించారు. ఇందుకు సంబంధించి డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పంపిన వివరాలను ఆయన ధర్మాసనం ముందుంచారు. 

వాటిని పరిశీలించిన ధర్మాసనం అదనపు ఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకుంది. వైద్య కళాశాల భవన నిర్మాణానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఆ నిర్మాణం ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసింది. (క్లిక్: ఆంధ్రాలోనే ఉంటాం .. భద్రాచలాన్ని తిరిగి ఆంధ్రాలో కలపాలి)

మరిన్ని వార్తలు