కోర్టు ముగిసే వరకు నిలబడండి! 

7 Jul, 2021 03:41 IST|Sakshi

కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు సీనియర్‌ అధికారులకు హైకోర్టు శిక్ష 

మొదట 9 రోజుల శిక్ష, జరిమానా విధింపు.. క్షమాపణ కోరిన అధికారులు 

దీంతో ఆ ఉత్తర్వులను సవరించిన జస్టిస్‌ దేవానంద్‌  

సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, ఐఎఫ్‌ఎస్‌ అధికారి, అప్పటి ఉద్యానవన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరికి హైకోర్టు తొమ్మిది రోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. అయితే వారిద్దరూ క్షమాపణ కోరడంతో పాటు కోర్టు ఉత్తర్వుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్పడం, వారి వయస్సును, ప్రస్తుత కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తీర్పును సవరించింది. జరిమానాను అలానే ఉంచి, పనివేళలు ముగిసేంత వరకు కోర్టులోనే నిలబడి ఉండాలని వారిని ఆదేశించింది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మూడు రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.

కేసు ఇదీ..
విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే నెలలో సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసి గతంలో నిర్ధేశించిన పలు అర్హతలను తొలగించింది. దీనిని సవాలు చేస్తూ ఎస్‌.కృష్ణ, మరో 35 మంది అభ్యర్థులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, సవరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.

పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వాటిని ఎత్తివేయాలంటూ ప్రభుత్వం అనుబంధ పిటిషన్‌ వేసింది. దానిని హైకోర్టు తోసిపుచ్చింది. తర్వాత హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌.. అధికారులు ఉద్ధేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తేల్చారు. మంగళవారం ఈ పిటిషన్‌ మరోసారి విచారణకు వచ్చింది. 

9 నెలల జాప్యం 
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల అమలులో 9 నెలల జాప్యం ఉందన్నారు. వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తేనే కోర్టు ఆదేశాలను అమలు చేసే ఇలాంటి అధికారుల పట్ల కనికరం చూపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలా చేస్తే తప్పుడు సంకేతం పంపినట్లు అవుతుందని తెలిపారు. కోర్టు ఆదేశాల ఉద్ధేశపూర్వక ఉల్లంఘనకు వీరికి శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మరో కోర్టు ధిక్కార కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం హైకోర్టు ముందు హాజరయ్యారు. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తానని, కొంత గడువునివ్వాలని ఆయన కోరడంతో న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ అందుకు అనుమతినిచ్చారు.  

మరిన్ని వార్తలు