సీఎం క్యాంపు కార్యాలయమంటే?

7 Oct, 2020 04:37 IST|Sakshi

గతంలో ఎక్కడైనా ఉన్నాయా?.. న్యాయస్థానం వరుస ప్రశ్నలు 

చంద్రబాబు ప్రభుత్వ ఖర్చుతో పలుచోట్ల నడిపారు

కౌంటర్‌ దాఖలు చేస్తామన్న అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌

విచారణ ఈ నెల 9కి వాయిదా

సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో మంగళవారం నుంచి అంశాలవారీగా ప్రారంభమైన విచారణ ఎక్కువ సమయం ‘ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం’ చుట్టూనే తిరిగింది. తొలుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, ఆ తరువాత జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ సత్యనారాయణమూర్తి వరుసగా అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌కు ప్రశ్నలు సంధించారు. సీఎం క్యాంపు కార్యాలయం అంటే అర్థం ఏమిటి? క్యాంపు కార్యాలయాలు ఏ సందర్భాల్లో ఏర్పాటు చేస్తారు? అసలు వేటిని క్యాంపు కార్యాలయాలంటారు? శాశ్వత నిర్మాణాన్ని క్యాంపు కార్యాలయంగా చెప్పొచ్చా? సీఆర్‌డీఏ చట్టంలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రస్తావన ఉందా? గతంలో ఎప్పుడైనా సీఎం క్యాంపు కార్యాలయాల ఏర్పాటు, వినియోగం జరిగిందా? అని హైకోర్టు ప్రశ్నించింది.

పలుచోట్ల చంద్రబాబు క్యాంపు కార్యాలయాలు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన స్వగ్రామం నారావారి పల్లెలో ఒక క్యాంపు కార్యాలయం, హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో మరో క్యాంపు కార్యాలయాన్ని నడిపారని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వాటికి అయిన వ్యయాన్ని ఖజానా నుంచి రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని తెలిపారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేస్తామని ఏజీ పేర్కొనటంతో సీఎం క్యాంపు కార్యాలయం, పలు కార్పొరేషన్ల కార్యాలయాల తరలింపు అంశాలపై విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

మాకు అలాంటి ఉద్దేశమేదీ లేదు..
సీఎం క్యాంపు కార్యాలయం గురించి సీఆర్‌డీఏ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదని, సీఆర్‌డీఏ పరిధిలోనే సీఎం కార్యాలయం ఉండాలని ఎక్కడా లేదని ఏజీ తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ముఖ్యమంత్రి ఇతర జిల్లాలకు వెళ్లినప్పుడు కొన్ని రోజులు ఉండి అధికారిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఉద్దేశించిందే క్యాంపు కార్యాలయమని పేర్కొంది. సీఎం తాత్కాలికంగా ఉండి పాలనా కార్యకలాపాలు నిర్వహిస్తే ఇబ్బంది లేదని, శాశ్వత భవనం కడితే దాన్ని ఎలా పరిగణించాలని ప్రశ్నించింది. దీనిపై ఏజీ సమాధానమిస్తూ  క్యాంపు కార్యాలయం ఏర్పాటు అన్నది ప్రస్తుత చట్టాల పరిధిలోకి రాని అంశమని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ముఖ్యమంత్రిని పనిచేయకుండా తామేమీ నిరోధించడం లేదని, తమకు అలాంటి ఉద్దేశం ఏదీ లేదని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. రాజధానికి సంబంధించి విశాఖపట్నం, కర్నూలులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ దాఖలైన వ్యాజ్యంపై కూడా ఈ నెల 9న విచారణ జరుపుతామని ప్రకటించింది. 

ఆ కథనంపై.. మా అసంతృప్తిని తెలియచేస్తున్నాం
పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో మంగళవారం నుంచి అంశాలవారీగా విచారణ ప్రారంభమైన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి సాక్షి పత్రికలో వచ్చిన ఓ కథనం గురించి ప్రస్తావించారు. దీనిపై తన అసంతృప్తిని తెలియచేస్తున్నట్లు ఏజీ శ్రీరామ్‌కు తెలిపారు. ఏ పత్రికైనా వాదనల సమయంలో జరగని సంభాషణలను రాయడం మంచిది కాదని, ఆ కథనం గురించి తనకు సోదర న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి చెప్పారని తెలిపారు. అనంతరం జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఏజీని ఉద్దేశించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎన్నో చెబుతుందంటూ హైకోర్టు వ్యాఖ్యానించినట్లు సాక్షి పత్రికలో వచ్చిందన్నారు. తాను ఊర్లో లేనని, అందులో ఏం వచ్చిందో చూడలేదని, కోర్టు ప్రొసీడింగ్స్‌ను ఎవరూ తప్పుగా రాయడానికి వీల్లేదని ఏజీ శ్రీరామ్‌ పేర్కొన్నారు. 

న్యాయమూర్తులే చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనం..
బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు యర్రంరెడ్డి నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ జడ్జీల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని, ఆ విషయాన్ని న్యాయమూర్తులే చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనం రాసిందన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్‌ను రోజూ తప్పుగా రాస్తున్నారన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉందని, అందువల్ల దీనిపై తామేమీ మాట్లాడబోమని పేర్కొంది. తప్పుగా వార్తలు రాసే పత్రికలపై న్యాయపరంగా ఏవైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని నాగిరెడ్డికి సూచించింది. 

మరిన్ని వార్తలు