జీవిత ఖైదీల విడుదలపై పలు సందేహాలు లేవనెత్తిన హైకోర్టు

13 Oct, 2022 06:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసే విషయంలో ప్రభుత్వానికి ఉన్న అధికారంపై హైకోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఆ ఖైదీలకు శిక్ష పడే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధానాన్ని అయితే అమలు చేస్తుం దో, అదే విధానం వారి విడుదల విషయంలోనూ అనుసరించాల్సి ఉంటుందంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు గుర్తు చేసింది.

ప్రస్తుత కేసులో దోషులకు శిక్ష పడే సమయానికి ఉన్న విధానం, వారి విడుదల సమయంలో ఉన్న విధానం వేర్వేరుగా ఉన్న నేపథ్యంలో వారి విడుదలను హైకోర్టు ప్రశ్నించింది. దోషులకు 2006లో శిక్షపడినందున అప్పటి విధానం, ఈ శిక్షను ఖరారు చేస్తూ 2013లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చే సమయానికి ఉన్న విధానం, ఇటీవల వారిని విడుదల చేసినందున ప్రస్తుత విధానం, ఇలా ఆ విధానాలన్నింటినీ తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆ విధాన నిర్ణయాల సహేతుకతను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఖైదీలను విడుదల చేసే అధికారం గవర్నర్‌కు ఉందని, అయితే జీవితఖైదు పడిన ఖైదీలు 14 ఏళ్ల శిక్ష అనుభవిస్తేనే వారిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని గుర్తు చేసింది. ప్రస్తుత కేసులో దోషులను విడుదల చేయాలంటూ గవర్నర్‌ను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్‌లో ఏ కారణాలు పేర్కొంది.. ఏ కారణాలతో గవర్నర్‌ వారి విడుదలకు ఆదేశాలిచ్చారో తెలుసుకోవాల్సిన అవసరం తమకుందని హైకోర్టు తెలిపింది.

ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేయాలని అటు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని, ఇటు పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు. తన భర్త పార్థమరెడ్డి హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న 8 మంది నేరస్తులను ్ఠవిడుదల చేయడాన్ని సవాలు చేస్తూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మెట్టు గ్రామానికి చెందిన ముడి నవనీతమ్మ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు