జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ

4 Apr, 2023 13:11 IST|Sakshi

అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల కలెక్టర్లకు భూమిని బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 45ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం సీజే జస్టిస్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజు గంగారావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 

ఈ క్రమంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా.. రాజధాని అందరిదీ అని, అందులో అందరూ ఉండాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. కౌంటర్‌ను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నా ప్రధాన న్యాయమూర్తి.. తదుపరిఇ విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు. 

కాగా, సీఆర్‌డీఏ చట్ట నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో పేదలకు నివాసాలు కల్పించేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న జారీ చేసిన జీవో 45ను సవాల్‌ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 

మరిన్ని వార్తలు