AP High court: ఎందుకీ గగ్గోలు?.. ఇప్పుడు ఎవరి ఇల్లు తగలబడుతోంది?

25 Jan, 2023 05:00 IST|Sakshi

వెకేషన్‌ కోర్టులో ఏం జరిగిందో మాకంతా తెలుసు 

వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా బహిర్గతం చేయట్లేదు 

న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది 

ఇంత జరిగినా స్పందించకుంటే రానున్న సీజేలు ఇబ్బంది పడతారు 

రోస్టర్‌లో రెండు పేరాలు మార్చారు.. ఒరిజినల్‌ రోస్టర్‌ను మార్చారు 

హైకోర్టు సీజే జస్టిస్‌ మిశ్రా ధర్మాసనం వ్యాఖ్యలు.. జీవో1పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

సాక్షి, అమరావతి: సంక్రాంతి సెలవుల సందర్భంగా అత్యవసర కేసుల విచారణకు ఏర్పాటైన వెకేషన్‌ కోర్టులో తాను నిర్దేశించిన రోస్టర్‌కు భిన్నంగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ నేతృత్వంలోని బెంచ్‌ వ్యవహరించడాన్ని తప్పుబట్టిన ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వెకేషన్‌ కోర్టులో ఏం జరిగిందో తమకు స్పష్టంగా తెలుసని, అయితే న్యాయ వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా ఆ విషయాలను బహిర్గతం చేయడం లేదని తెలిపింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్న సీజే ధర్మాసనం, ఇంత జరిగిన తరువాత కూడా తాము స్పందించకుంటే భవిష్యత్తులో వచ్చే ప్రధాన న్యాయమూర్తులు ఇలాగే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది.

పరిపాలనాపరంగా ప్రధాన న్యాయమూర్తి నిర్దేశించిన రోస్టర్‌లో రెండు పేరాలు మార్చారని, తద్వారా ఒరిజినల్‌ రోస్టర్‌ మారిందని ధర్మాసనం తెలిపింది. అసలు జీవో 1 విషయంలో ఏదో జరిగిపోతోందని రాజకీయ పార్టీలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయని ప్రశ్నించింది. అంతగా స్పందించేందుకు ఎవరి ఇల్లు తగలబడుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విధానంపై ఎందుకింత గగ్గోలు పెడుతున్నారని నిలదీసింది. అది ఓ సాధారణ నిర్ణయమని వ్యాఖ్యానించింది. జీవో 1 విషయంలో ఇరుపక్షాల వాదనలు పూర్తైనందున తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. తుది విచారణ జరిపిన నేపథ్యంలో వారంలో తీర్పు వెలువరిస్తామని తెలిపింది.

ఇదీ నేపథ్యం...
రోడ్లు, రోడ్‌ మార్జిన్లలో బహిరంగ సభల ఏర్పాటును నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న జారీ చేసిన జీవో 1ని సవాలు చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కాకా రామకృష్ణ సంక్రాంతి సెలవుల్లో అత్యవసర కేసులను మాత్రమే విచారించే హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ముందు వ్యూహాత్మకంగా పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్‌ దేవానంద్, జస్టిస్‌ కృపాసాగర్‌ ధర్మాసనం జీవో 1 అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు, రామకృష్ణ వ్యాజ్యంపై విచారణ జరపాలని సీజే ధర్మాసనానికి స్పష్టం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం ఈ వ్యాజ్యంపై సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజుల ధర్మాసనం వాదనలు విన్నది. ఇదే అంశంపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత కొల్లు రవీంద్ర, కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై ధర్మాసనం మంగళవారం పూర్తిస్థాయిలో వాదనలు విన్నది.

ఆ అధికారం పోలీసులకు మాత్రమే ఉంది..
కొల్లు రవీంద్ర తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. సభలు, ర్యాలీలు, ధర్నాలు, రోడ్‌షోలు తదితరాల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు మాత్రమే ఉందన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఆదేశాలిచ్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వానికి కేవలం పర్యవేక్షణ అధికారం మాత్రమే ఉందన్నారు. అంతిమంగా పరిస్థితుల ఆధారంగా డీజీపీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతిపక్షాలు తమ గళం విప్పకూడదనే ప్రభుత్వం జీవో 1 జారీ చేసిందన్నారు. సహేతుక ఆంక్షలు విధిస్తూ అనుమతులిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు.

అయితే ప్రభుత్వం ఏకంగా సభలను నిషేధించిందన్నారు. ప్రజలు జీవించే హక్కు, రాజకీయ నేతల భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు తగిన రీతిలో స్పందించకపోవడం, భద్రత చర్యలు చేపట్టకపోవడం లాంటి కారణాల వల్లే తొక్కిసలాట ఘటనలు జరిగాయన్నారు. నారా లోకేష్‌ పాదయాత్రకు అనుమతినిచ్చిన పోలీసులు అసంబద్ధ షరతులు విధించారని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేపడితే అనుమతినివ్వడమే కాకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఎస్పీలను డీజీపీ ఆదేశించారన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు.

హక్కులను కాలరాయడం సరికాదు...
కన్నా లక్ష్మీనారాయణ తరఫు న్యాయవాది టి.శ్రీధర్‌ వాదనలు వినిపిస్తూ, నిరసనలను పలు రూపాల్లో తెలియచేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉందన్నారు. ఈ హక్కును కాల రాయడం సమాజానికి మంచిది కాదన్నారు. ఎప్పుడో ఒకసారి నిర్వహించే సభలు, సమావేశాలను నిషేధించడం సరికాదన్నారు. అధికార పార్టీ విషయంలో ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీల విషయంలో మరో రకంగా వ్యవహరించడం వివక్షే అవుతుందన్నారు.

డీజీపీ ద్వారానే ఉత్తర్వులు ఇవ్వాలి..
పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తరఫున సీనియర్‌ న్యాయవాది రవిశంకర్‌ వాదనలు వినిపిస్తూ గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోడ్డు షోల విషయంలో తెచ్చిన సర్క్యులర్‌ను అన్ని పార్టీలు స్వాగతించాయని చెప్పారు. డీజీపీ స్వతంత్రంగా వ్యవహరించి పరిస్థితులను బట్టి సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోవాలా..?
సీపీఐ రామకృష్ణ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. జీవో 1పై విచారణ జరిపే అధికారం వెకేషన్‌ బెంచ్‌కు ఉందన్నారు. హైకోర్టు నోటిఫికేషన్‌ ప్రకారం అత్యవసర కేసులను విచారించే విచక్షణాధికారం సీనియర్‌ వెకేషన్‌ జడ్జికి ఉందని తెలిపారు. అందులో భాగంగానే వెకేషన్‌ బెంచ్‌ జీవో 1పై తమ వ్యాజ్యాన్ని విచారించిందన్నారు. ప్రభుత్వం పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. ఇలాంటి జీవో ఒక్కరోజు కూడా మనుగడలో ఉండటానికి వీల్లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ.. జీవో ఎమ్మెస్‌ అయినా, జీవో ఆర్టీ అయినా ప్రభుత్వం తీసుకున్నది సాధారణ నిర్ణయమేనని, దీనిపై రాజకీయ పార్టీలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయని ప్రశ్నించింది.

ప్రస్తుత చర్యలు సరిపోవడం లేదు...
పార్టీలు రోడ్లపై నిర్వహిస్తున్న రోడ్‌షోలు, సభలు, సమావేశాలను నియంత్రించే విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని పాత్రికేయుడు బాల­గంగాధర్‌ తిలక్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై కూడా ధర్మాసనం విచారణ జరిపింది. జీవో 1 నేపథ్యంలో ఈ వ్యాజ్యం నిరర్థకం కాదా? అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీఆర్‌ రెడ్డిని ధర్మాసనం  ప్రశ్నించింది. పోలీసులు మరిన్ని చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ న్యాయవాది కోరారు.

పరిస్థితులను బట్టే నిర్ణయం..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధించే ఉద్దేశం ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదన్నారు. జీవో 1లో కూడా ఎక్కడా నిషేధం అన్న పదమే లేదన్నారు. సభలు, సమావేశాల కోసం సమర్పించే ప్రతి దరఖాస్తును అప్పటి పరిస్థితుల ఆధారంగా పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే వాటిని నియంత్రించే అధికారం పోలీసులకు ఉందన్నారు. ప్రజల భద్రత ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రజలు తిరిగే పరిస్థితి లేకుండా చేయడం వల్లే కందుకూరు ఘటన జరిగిందన్నారు.

జీవో 1 వల్ల వ్యక్తులకు, రాజకీయ పార్టీలు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. నిబంధనల ప్రకారం పోలీసులకు మార్గనిర్దేశం చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. లోకేష్‌ పాదయాత్రకు అనుమతినిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఓ రాజకీయ పార్టీ ప్రైవేట్‌ గ్రౌండ్‌లో సభ నిర్వహణకు అనుమతి కోరితే మంజూరు చేశామన్నారు. ప్రతిదీ పరిస్థితులను బట్టి ఉంటుందని తెలిపారు. వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ దశలో సిద్దార్థ లూత్రా మధ్యంతర ఉత్తర్వుల సంగతి ప్రస్తావించగా.. తుది విచారణ చేపట్టామని, వారంలోపు తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు