రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌కు జైలుశిక్ష

22 Apr, 2022 08:35 IST|Sakshi

ఏపీఎండీసీ చీఫ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌కు కూడా..

కోర్టుధిక్కార కేసులో హైకోర్టు తీర్పు

సాక్షి, అమరావతి: కోర్టుధిక్కార కేసులో అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీఎండీసీ) చీఫ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఎం.సుదర్శనరెడ్డిలకు హైకోర్టు ఆరు నెలల జైలుశిక్ష, రూ.రెండువేల జరిమానా విధించింది. అప్పీల్‌కు వెళ్లేందుకు తీర్పు అమలును వారం రోజులు నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి గురువారం తీర్పు చెప్పారు. మంగంపేట ప్రాంతంలో కొన్ని నిర్మాణాలను అధికారులు కూల్చేశారు.

ఏ నిర్మాణాలను కూల్చివేశారో తేల్చి, ఆ నిర్మాణాల విలువను తేల్చేందుకు ఇంజనీర్లను నియమించేలా ఆదేశాలివ్వాలంటూ ఓబులవారిపల్లెకు చెందిన ఎ.నరసమ్మ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు నిర్మాణాల విలువ తేల్చేందుకు ఇంజనీర్లను నియమించాలని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో నరసమ్మ కోర్టుధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి.. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడానికి రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్, ఏపీఎండీసీ చీఫ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఎం.సుదర్శనరెడ్డి కారణమని తేల్చి జైలుశిక్ష, జరిమానా విధించారు. 

చదవండి: (వీఆర్‌ఏల ఆగం బతుకులు.. కార్లు కడుగుడు.. బట్టలు ఉతుకుడు) 

మరిన్ని వార్తలు