ఇలాగే వదిలేస్తే రేపు తాపీమేస్త్రిని పంపుతారు.. ఏపీ హైకోర్టు సీరియస్‌

17 Mar, 2023 07:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: వ్యక్తిగత హాజరుకు తామిచ్చిన ఆదేశాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం, విజయవాడ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) బేఖాతరు చేయడంపై హైకోర్టు మండిపడింది. వీరు హాజరుకాకుండా ఓ ఇంజనీర్‌ స్థాయి అధికారిని కోర్టుకు పంపడాన్ని తప్పుపట్టింది. ఇలాగే వదిలేస్తే రేపు తాపీమేస్త్రిని కూడా పంపుతారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌ ఇప్పటికే రెండుసార్లు హాజరయ్యారని, కమిషనర్‌ కన్నా తానే ఎక్కువని డీఆర్‌ఎం భావిస్తున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

డీఆర్‌ఎం స్థాయి అధికారిని కూడా కోర్టుకు రప్పించలేకపోతే ఇక హైకోర్టు ఉండి ప్రయోజనం ఏముందని ప్రశ్నించింది. అటు జీఎం, ఇటు డీఆర్‌ఎంలకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీచేసేందుకు సిద్ధమైంది. ఈ దశలో డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌.. వారెంట్‌ అవసరం లేదని, కోర్టుముందు హాజరయ్యేందుకు మరో అవకాశం ఇవ్వాలని పలుమార్లు అభ్యర్థించడంతో న్యాయస్థానం శాంతించింది.

విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తూ ఆ రోజున జీఎం, డీఆర్‌ఎం స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. విజయవాడ మధురానగర్‌లోని అప్రోచ్‌రోడ్డు, రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ జవ్వాజి సూర్యానారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కె.ఎస్‌.మూర్తి వాదనలు వినిపిస్తూ.. కోర్టు జోక్యంతో పనులు పునఃప్రారంభం అయ్యాయని చెప్పారు. కోర్టుకు హాజరైన విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ స్పందిస్తూ.. గడువు పెంచాలని కాంట్రాక్టర్‌ కోరారని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. ఈ సమయంలో రైల్వే జీఎం, డీఆర్‌ఎం కోర్టుకు హాజరుగాకపోవడంపై న్యాయమూర్తి మండిపడ్డారు.
చదవండి: మూడు రోజులు వానలే.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం   

మరిన్ని వార్తలు