ముగ్గురు అధికారులకు జైలుశిక్ష, జరిమానా

7 May, 2022 10:27 IST|Sakshi

అప్పీలుకు వీలుగా అరుణ్‌కుమార్, వీరపాండియన్‌ల శిక్ష అమలు నిలుపుదల

పూనం మాలకొండయ్య శిక్ష అమలు

దీంతో ధర్మాసనం ముందు అత్యవసరంగా అప్పీల్‌ దాఖలు

శిక్ష అమలును నిలుపుదల చేసిన ధర్మాసనం

సాక్షి, అమరావతి: కోర్టుధిక్కార కేసులో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, ఐఏఎస్‌ అధికారి జి.వీరపాండియన్‌లకు హైకోర్టు ఒక్కొక్కరికి నెలరోజుల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అరుణ్‌కుమార్, వీరపాండియన్‌ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకావడంతో అప్పీల్‌ దాఖలు చేసుకునేందుకు వీలుగా శిక్ష, జరిమానా అమలును ఆరువారాలు నిలుపుదల చేసింది. తీర్పు వెలువరించే సమయానికి పూనం మాలకొండయ్య హాజరుగాకపోవడంతో ఆమెకు విధించిన శిక్షను నిలుపుదల చేయలేదు. మే 13వ తేదీలోపు రిజిస్ట్రార్‌ (జ్యుడిషియల్‌) ముందు లొంగిపోవాలని పూనం మాలకొండయ్యను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం తీర్పు చెప్పారు.

ఈ తీర్పుపై పూనం మాలకొండయ్య అత్యవసరంగా సీజే ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సింగిల్‌ జడ్జి తీర్పు అమలును తదుపరి విచారణ వరకు నిలుపుదల చేసింది. కర్నూలు జిల్లా సెలక్షన్‌ కమిటీ తనను విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2గా ఎంపిక చేయకపోవడాన్ని సవాలుచేస్తూ ఎన్‌.ఎం.ఎస్‌.గౌడ్‌ 2019లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు పిటిషనర్‌ పేరును పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

ఆ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ గౌడ్‌ కోర్టుధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ధిక్కార పిటిషన్‌ను జస్టిస్‌ దేవానంద్‌ విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కోర్టుధిక్కార పిటిషన్‌ దాఖలు చేసిన తరువాతనే కోర్టు ఆదేశాలను అమలు చేశారని, కోర్టు ఆదేశాల అమలులో ఉద్దేశపూర్వక జాప్యం కనిపిస్తోందని చెప్పారు. కోర్టు ఉత్తర్వులను సకాలంలో అమలుచేసే పరిస్థితి లేకపోతే, గడువు పెంచాలని కోరుతూ అఫిడవిట్‌ వేయవచ్చని, అధికారులు ఆ పని చేయలేదని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను అమలుచేసే సదుద్దేశం అధికారుల్లో కనిపించడం లేదన్నారు. అధికారులది ఉద్దేశపూర్వక ఉల్లంఘనేనంటూ ముగ్గురు అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.  

మరిన్ని వార్తలు