మా వాటా ఆస్తులు, నిధులు మాకు ఇచ్చేయండి

12 Aug, 2021 11:01 IST|Sakshi

తెలంగాణకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర లేఖ

సాక్షి, అమరావతి: విభజన చట్టం ప్రకారం రావలసిన స్థిర, చరాస్తులను వెంటనే తమకు అప్పగించాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలుగు అకాడమీకి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిన నేపథ్యంలో తమకు రావలసిన నిధులు, ఆస్తులకు సంబంధించిన వాటాలను వెంటనే అప్పగించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలుగు అకాడమీని వేరుగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నందమూరి లక్ష్మీపార్వతిని చైర్మన్‌గా నియమించడం తెలిసిందే.

అకాడమీ కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కూడా పూర్తయ్యింది. ఉమ్మడి తెలుగు అకాడమీకి సంబంధించి హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న డిపాజిట్లు, ఇతర నిధులు, స్థిరాస్తులలో ఏపీకి రావలసిన వాటాకు సంబంధించి అకాడమీ అధికారులు తెలంగాణ అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీనిపై ఏపీ తెలుగు అకాడమీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఏపీ తెలుగు అకాడమీకి అనుకూలంగా తీర్పు వెలువరించింది. అకాడమీలోని నిధులను, భవనాలను ఇతర స్థిర, చరాస్తులను 58:42 నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు పంచుకోవాలని స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ అకాడమీ, ఆ  ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడా తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఏపీ అకాడమీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి.  

మరిన్ని వార్తలు