కోనసీమ ఆందోళనల్లో జనసేన, టీడీపీ హస్తం: హోంమంత్రి సీరియస్‌

24 May, 2022 19:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేశాయని ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం జరిగిందని హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కోనసీమ జిల్లా పేరును మార్చవద్దంటూ అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. మంత్రి విశ్వరూప్‌, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

హోంమంత్రి తానేటి వనిత ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించారు. మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన డా.బీఆర్‌ అంబేద్కర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. అలాంటి మహానుభావుని పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమన్నారు. కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ కోనసీమగా పేరు మార్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాని ఆమె సూచించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీని వెనుక టీడీపీ, జనసేన పార్టీలున్నాయన్న అనుమానం ఉందన్నారు. 
చదవండి: Konaseema: కోనసీమ ఉద్రిక్తతలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి

‘గొడవలు చేసే వారి వెనుక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు 20 మందికి పైగా పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచారు. స్కూల్ బస్సు లను కూడా తగులబెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాయి. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తప్పక చర్యలు ఉంటాయి. ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నాను’ అని హోంమంత్రి వెల్లడించారు.
చదవండి: పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దు: పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

మరిన్ని వార్తలు