సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఏపీ ఆతిథ్యం

26 Feb, 2021 02:45 IST|Sakshi

కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన తిరుపతిలో మార్చి 4న సమావేశం

ఆయా రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారంపై చర్చలు

26 అంశాలపై సమాలోచనలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సన్నాహక సమావేశం

ఎజెండా అంశాలపై వివరాలను సీఎంకు నివేదించిన అధికారులు 

సాక్షి, అమరావతి: సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ 29వ సమావేశానికి ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ఆతిథ్యం ఇస్తోంది. మార్చి 4వ తేదీన తిరుపతిలో ఈ సమావేశాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధమవుతోంది. దీంతో పాటు ఈ సమావేశంలో చర్చించనున్న ఎజెండా అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగే ఈ కౌన్సిల్‌ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి (ప్రస్తుతం సీఎం లేరు) నుంచి ముఖ్యమంత్రులు.. అండమాన్‌ నికోబార్, లక్షద్వీప్‌ల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు.

ప్రధానంగా 26 అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరుగుతాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, ఆర్థిక శాఖ కార్యదర్శి నటరాజన్‌ గుల్జార్, అగ్రికల్చర్‌ అండ్‌ కో ఆపరేషన్‌ స్పెషల్‌ సెక్రటరీ మధుసూధన్‌ రెడ్డి, ఇరిగేషన్‌ సెక్రటరీ శ్యామల రావు, దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు