చకచకా సదుపాయాలు.. జోరుగా ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’

9 Jan, 2023 08:25 IST|Sakshi
వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో నిర్మించనున్న∙ స్వాగత ఆర్చ్‌ నమూనా

ఇప్పటికే 2 లక్షలకుపైగా గృహ నిర్మాణాలు పూర్తి 

వెంటనే నీరు, విద్యుత్‌ సరఫరాకు అధిక ప్రాధాన్యం 

వైఎస్సార్‌ జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్‌ల నిర్మాణాలు

సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లను అందచేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా పేద కుటుంబాలకు పక్కా నివాసాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైఎస్సార్‌–జగనన్న కాలనీల రూపంలో ఏకంగా పట్టణాలే నిర్మితమవుతున్నాయి. ఇప్పటివరకూ రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇందులో 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు కాగా, మిగిలిన 18.63 లక్షలు సాధారణ గృహాలు. సాధారణ ఇళ్లలో 16.67 లక్షల గృహాల శంకుస్థాపనలు పూర్తి కాగా, నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17 వేల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది.   

8,485 లేఅవుట్లలో విద్యుత్‌ సర్వే పూర్తి 
ఇంటి నిర్మాణాలు కొనసాగుతున్న 8,485 లేఅవుట్లలో విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన సర్వే పూర్తయింది. 3,248 లేఅవుట్లలో విద్యుత్‌ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు లాంటి పనులు చకచకా కొనసాగుతున్నాయి. 1,411 లేఅవుట్లలో పనులు పూర్తయ్యాయి. నీటి సరఫరాకు సంబంధించి 1,561 లేఅవుట్లలో పనులు ప్రారంభించారు. 6,012 లేఅవుట్లలో పనుల కోసం టెండర్లు ఆహ్వానించారు.  

1.40 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్, నీటి కనెక్షన్లు 
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 2.09 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో 1,46,440 ఇళ్లకు విద్యుత్, 1,40,986 ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్మాణాలు పూర్తయిన వెంటనే విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లు ఇచ్చేలా గృహ నిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. వైఎస్సార్‌–జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్‌లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 50 ఇళ్లకు పైగా ఉన్న లేఅవుట్లలో స్వాగత ఆర్చ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రూ.50 కోట్లతో 1,127 లేఅవుట్లలో ఆర్చ్‌ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు.

వసతులపై ప్రత్యేక దృష్టి
వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యే­క దృష్టి సారించాం. నిర్మాణం పూర్తయిన ప్రతి ఇంటికి వెంటనే నీరు, విద్యుత్‌ సరఫరా కనెక్షన్లు ఇవ్వా­లని సీఎం జగన్‌ స్పష్టం చే­శారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు లబ్ధిదా­రులతో సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. నిర్మాణం తుది­దశ­కు చేరుకున్న సమయంలో నీరు, విద్యుత్‌ కనెక్షన్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. డ్రెయిన్ల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం.   
– అజయ్‌ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి


కాకినాడ జిల్లా జగ్గంపేట డివిజన్‌ మురారి  గ్రామంలోని వైఎస్సార్‌–జగనన్న కాలనీలో ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తున్న సిబ్బంది 

మరిన్ని వార్తలు