Infinity Vizag: ఐటీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఇన్ఫినిటీ వైజాగ్‌

20 Jan, 2023 12:32 IST|Sakshi

రాష్ట్రంలో ఐటీ పెట్టుబడుల అవకాశాలపై విశాఖలో రెండురోజుల సదస్సు

వర్చువల్‌గా ప్రారంభించనున్న కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖరన్‌

హాజరుకానున్న ఐటీ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర అధికారులు

12 ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు స్టాల్స్‌ ఏర్పాటు

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంతోపాటు పలు ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా రెండురోజుల ‘ఇన్ఫినిటీ వైజాగ్‌’ సదస్సు శుక్రవారం ప్రారంభం కానుంది. ఐటీ పెట్టుబడుల ప్రధాన ఆకర్షణగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఐటాప్‌), సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫినిటీ వైజాగ్‌ పేరుతో శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు నిర్వహిస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాల వైపు ఐటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో వైజాగ్‌లో ఉన్న మెరుగైన అవకాశాల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్‌ చేసేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖరన్‌ వర్చువల్‌గా ప్రారంభించే ఈ సదస్సులో రెండోరోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పాల్గొంటారు. సైయంట్‌ ఫౌండర్‌ బి.వి.ఆర్‌.మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొనే ఈ సదస్సుకు కేంద్ర ఐటీశాఖ కార్యదర్శి అఖిలేష్‌కుమార్‌ శర్మ, ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ అరవింద్‌కుమార్, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు, యూనికార్న్‌ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారు.

బాస్, టెక్‌మహీంద్రా, మైక్రోసాఫ్ట్, సీమెన్స్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్, సైబర్‌ సెక్యూరిటీ, ఐశాట్‌ మొదలైన 20కి పైగా ఐటీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సదస్సులో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు, ప్రయోజనాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నట్లు ఐటాప్‌ ప్రెసిడెంట్‌ కోసరాజు శ్రీధర్‌ తెలిపారు.

ఐటీ సంస్థలకు 21 అవార్డులు అందిస్తున్న ఎస్‌టీపీఐ
రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనపరుస్తున్న ఐటీ కంపెనీలకు సదస్సు తొలిరోజు ఎస్‌టీపీఐ అవార్డులు ఇవ్వనుంది. ఐటీ రంగంలో అత్యుత్తుమ ఎగుమతులు నమోదు చేసిన కంపెనీ, అత్యధికమందికి ఉపాధి కల్పించిన కంపెనీ, అత్యధిక మహిళలకు ఉపాధి కల్పించిన సంస్థ, ఐటీ ఎమర్జింగ్‌ సిటీస్, యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ వంటి 21 విభాగాల్లో ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. సరికొత్త ఆవిష్కరణలు నమోదు చేసిన స్టార్టప్‌కు రూ.లక్ష నగదు పురస్కారంతోపాటు అవార్డు, మెమెంటో ఇవ్వనుంది.

ఐటీలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు..
భవిష్యత్తులో ఐటీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఏపీని నిలిపేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై రోడ్‌­మ్యాప్‌ రూపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఇండస్ట్రీ 4.0, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, వెబ్‌ 3.0 ఆవిష్కరణలు, డీప్‌టెక్‌ డొమైన్‌.. తది­తర రంగాల్లో రాష్ట్ర ఐటీ రంగాన్ని అగ్రగామి­గా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. దానికనగుణంగా ఈ సదస్సు­లో కార్యక్రమాలను రూపొందించారు.

బిజి­నెస్‌ టూ బిజినెస్‌ (బీటూబీ) నెట్‌­వర్కింగ్‌ అవకాశాలు సృష్టిసూ మల్టీ నేషనల్‌ కంపెనీ­ల­తో నెట్‌వర్క్‌ చేసుకోవడం, పెట్టు­బడుల్ని ఆకర్షిం­చడం మొదలైన అం­శాలే ముఖ్య అజెండాగా సదస్సు నిర్వహిస్తున్నారు. తొలి­రోజు శుక్ర­వా­రం ఐటీ, స్టార్టప్‌లపై దృష్టి సారించనున్నారు. రెండోరోజున ఐటీ ఆధారిత పరిశ్రమలు, బీపీవో కంపెనీలపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు పర్యావరణ భాగ­స్వాములుగా నాస్‌కామ్, టై ఏపీ చాప్టర్, ఏపీ ఛాంబర్స్, ఏపీ స్టార్టప్స్, ఏ–హబ్‌ వ్యవహరించనున్నాయి. వివిధ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు కలిపి మొత్తం 12 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి.
చదవండి: 'బంగారు' బాటలో.. చిప్పగిరిలో మొదలైన పుత్తడి వెలికితీత

మరిన్ని వార్తలు