ప్రభుత్వంతో ఘర్షణ ఎందుకు?

8 Dec, 2020 05:35 IST|Sakshi
మాట్లాడుతున్న విజయబాబు

నిమ్మగడ్డ తీరుపై మండిపడ్డ ఏపీ ఇంటెలెక్చువల్స్‌ అండ్‌ సిటిజన్స్‌ ఫోరం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంతో తీవ్ర స్థాయిలో ఘర్షణ పడైనా.. ఇంతటి కరోనా విపత్తులోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఎందుకింత పట్టుదల కనబరుస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలెక్చువల్స్‌ అండ్‌ సిటిజన్స్‌ ఫోరం ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపనంత మాత్రాన స్థానిక సంస్థల స్థాయిలో ప్రస్తుతం సాగుతున్న పాలన కుంటుపడుతోందా అని నిలదీసింది. పాలన సజావుగా సాగుతున్నప్పుడు ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఇంటెలెక్చువల్స్‌ అండ్‌ సిటిజన్స్‌ (మేధావుల) ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆర్టీఐ మాజీ కమిషనర్‌ పి.విజయబాబు నేతృత్వంలోని పలువురు ప్రతినిధులు సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే కరోనాకు భయపడి మూడొంతుల మంది ఓటర్లు ఓటేయడానికే రాలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు మన రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించినా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. అంత తక్కువ స్థాయి ఓటింగ్‌తో ఎన్నికలు నిర్వహిస్తే ‘ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ (స్వేచ్ఛ, పారదర్శకం)’గా ఎన్నికల నిర్వహించినట్టా అని విజయబాబు ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇప్పుడు అనుకూల పరిస్థితులు లేవని తేల్చి చెప్పారు. అవసరమైతే ఈ అంశంపై నిమ్మగడ్డతో ఏ చర్చకైనా సిద్ధమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ మంచిది కాదని తమ ఫోరం తరఫున గవర్నర్‌కు లేఖ రాస్తామని చెప్పారు.

ప్రభుత్వంపై అక్కసు.. ప్రతిపక్షంపై ప్రేమా?
నిమ్మగడ్డ వ్యవహారశైలి ప్రభుత్వంపై అక్కసు, ప్రతిపక్షంపై అవ్యాజ్యమైన ప్రేమ చూపుతున్నట్టు ఉందని విజయబాబు విమర్శించారు. ఇందుకు ఆయన కొందరు నేతలతో స్టార్‌ హోటళ్లలో జరిపిన రహస్య చర్చలే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు మల్లికార్జునమూర్తి, పిళ్లా రవి, సాయిరాం పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు