వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి

17 Oct, 2022 04:01 IST|Sakshi
విజయవాడలో జరిగిన సమావేశంలో వ] ూట్లాడుతున్న సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ విజయబాబు

సాక్షి, అమరావతి: అధికారం దూరమైందనే అక్కసుతో టీడీపీ నాయకులు ప్రజలపై కక్ష పెంచుకుని అడుగడుగునా అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఏపీ ఇంటెలెక్చువల్స్‌ అండ్‌ సిటిజన్స్‌ ఫోరం మండిపడింది. విజయవాడలో ఆదివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ‘పాలనా వికేంద్రీకరణ: ప్రచారాలు, వాస్తవాలు’ అనే అంశంపై పలువురు న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

చంద్రబాబు బృందం మూడేళ్లుగా అభివృద్ధిని అడ్డుకుంటోందని ధ్వజ మెత్తారు. చారిత్రక తప్పిదాలను పునరావృతం చేసేందుకు మీడియాను, న్యాయవ్యవస్థను సైతం ఉపయోగించుకుంటోందన్నారు. అమరావతి పేరు తో దోపిడీ చేయడమే కాకుండా ఇతర ప్రాంతాలు ఎదగకుండా నీచ రాజకీయాలు చేయడం క్షమించరానిదన్నారు. ప్రభుత్వం దృష్టిలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి చిత్తూరు జిల్లాలోని చివరి గ్రామం వరకు ఒక్కటేనని, అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరగాలన్నారు.

చంద్రబాబు బృందం ఆయన వర్గ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ రెండు జిల్లాలు మాత్రమే అభివృద్ధి చెందాలని చెబుతోందన్నారు. మరో 30ఏళ్లకు కూడా పూర్తికాని అమరావతి కోసం రూ.లక్ష కోట్ల కు పైగా వెచ్చిస్తే మిగతా ప్రాంతాలు ఏం కావాలని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయాక బాబుకు  ప్రజలు అధికారం ఇస్తే దుర్వినియోగం చేశారన్నారు.

ప్రజలపై పగబట్టిన బాబు 
చంద్రబాబు బృందం తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు అమరావతి రైతులను పావులుగా మార్చేసింది. రైతులను పురిగొల్పి చంద్రబాబు తెరవెనుక ఆనందిస్తున్నారు. అమరావతి ప్రపంచ రాజధాని ఎలా అవుతుంది? భారీ నిర్మాణాలకు ఈ ప్రాంతం అనువుకాదని ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు. నిర్మాణాల భారం లేకుండా రాజధాని కోసం నాగార్జున వర్సిటీ భవనాలు ఇస్తామన్నా తీసుకోకుండా గడ్డి తినేందుకు అమరావతిని ఎంచుకున్నారు.

ఇక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది. ఇలాంటి తప్పులకు విదేశాల్లో అయితే మరణ శిక్ష విధించేవారు. అధికారం ఊడగొట్టి 23 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేకపోగా ప్రజలపై పగబట్టారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కోర్టులను వాడుకుంటున్నారు. అమరావతి భూములు వ్యవసాయయోగ్యమైనవి, ఇక్కడ ఆ తరహా పరిశ్రమలకే అనుకూలం. చంద్రబాబు ఇప్పటికైనా మారాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలి.     
– పి.విజయబాబు, రాష్ట్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌

మిగతా ప్రాంతాలు ఏం కావాలి?
చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని బలిపెడుతున్నారు. ఆయనకు వంతపాడుతూ కొన్ని పత్రికలు, మీడియా అమరావతి రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయి. ప్రాంతీయ అసమానతల వల్లనే తెలంగాణ విడిపోయింది, అదే తప్పు చంద్రబాబు అమరావతి పేరుతో చేశారు. వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణ కమిటీ చెప్పినా పట్టించుకోకుండా అమరావతి పేరుతో రూ.వేల కోట్లు వెచ్చించి అన్నీ తాత్కాలిక భవనాలే నిర్మించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి వెళ్లారు. రూ.లక్షల కోట్లను అమరావతిలోనే వెచ్చిస్తే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు ఏమైపోవాలి? మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుంది.     
– పిళ్లా రవి, న్యాయవాది

కొత్త రాజధాని నిర్మాణం అసాధ్యం
ఏ దేశంలోనైనా అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరాన్నే రాజధానిగా ఎంచుకుంటారు. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అన్నిచోట్లా పెద్ద నగరాలను రాజధానిగా ఎంచుకున్నారు. సృష్టికి ప్రతి సృష్టి చేయాలని కలలు కంటూ చంద్రబాబు అమరావతిని ఎంచుకున్నారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఇలాంటి తప్పు ఏ నాయకుడూ చేయరు. రాష్ట్రంలోని మూడు పెద్ద నగరాల్లో అధికార వికేంద్రీకరణ చేయాలి. కొత్త రాజధాని నగరం నిర్మించడం మాటలు కాదు. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌ ఇప్పటికీ ప్రగతి సాధించలేకపోయింది.   
  – కొణిజేటి రమేష్, పారిశ్రామికవేత్త

రెండు జిల్లాలే ముఖ్యమా?
అభివృద్ధి అంటే భవనాలు, పార్కులు కాదు. సామాన్యుడు తలెత్తుకు తిరిగేలా ఉండాలి. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు ఇవ్వరట. వారికి స్థానం లేని ప్రాంతం రాజధాని ఎలా అవుతుంది? చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిరుపేదలు, సామాన్యుల హక్కులను దోచుకున్నారు. కేవలం రెండు జిల్లాలు అభివృద్ధి చెందితే చాలా? ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఏమైపోవాలి? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.     
– నామాల కోటేశ్వర్‌రావు, న్యాయవాది 

వికేంద్రీకరణ తప్పనిసరి అవసరం
ఎవరైనా ఒకసారి తప్పు జరిగితే దాన్నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. పాలకులైతే మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మళ్లీమళ్లీ తప్పులు చేసేవారిని ఏమనాలి? చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రతిపక్ష టీడీపీ అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటోంది.

ఉత్తరాంధ్ర, రాయలసీమ రాష్ట్రంలో అంతర్భాగం కాదా? ఆ ప్రాంతాల అభివృద్ధి టీడీపీకి అవసరం లేదా? ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని అడ్డుకుంటూ మరో తప్పు చేస్తున్నారు. 
    – డాక్టర్‌ చన్నంశెట్టి చక్రపాణి, రిటైర్డ్‌ ఎస్పీ

సమగ్రాభివృద్థికి వెన్నుపోటు 
పాలకులు విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రానికీ లేనన్ని ఆటంకాలను చంద్రబాబు సృష్టిస్తున్నారు. కేంద్రీకృత అభివృద్ధితో తెలుగు ప్రజలు ఏం కోల్పోయారో చరిత్ర చూస్తే అర్థమవుతుంది. చారిత్రక తప్పిదాలను చంద్రబాబు పునరావృతం చేశారు. వాస్తవానికి అమరావతి ప్రజలు ఇక్కడ రాజధాని కావాలని అడగలేదు. చంద్రబాబు తన వర్గం వారితో రైతుల భూములు బలవంతంగా తీసుకున్నారు.

సైబర్‌ టవర్స్‌ నిర్మాణం సమయంలోనూ బ్లూప్రింట్‌ తయారీకి ముందే తనవారితో భూములు కొనిపించారు. అదే సూత్రాన్ని ఇక్కడా అమలు చేశారు. నాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు, ఈనాడు అధినేత రామోజీరావు దీనికి సూత్రధారులు. అమరావతి అంతా అవినీతిమయం. 
    – కృష్ణంరాజు, రాజకీయ విశ్లేషకులు  

>
మరిన్ని వార్తలు