అనాస రైతుకు బాసట: రైతు బజార్లలో విక్రయాలు

4 Jul, 2021 08:25 IST|Sakshi

రంగంలోకి ఐటీడీఏ, మార్కెటింగ్‌ శాఖ

ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోని రైతు బజార్లలో విక్రయాలు

ఒక్కో కాయకు రూ.12 నుంచి రూ.15 ఆదాయం

సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా పండించే పంట అనాస.  ప్రారంభంలో ధర బాగుండటంతో మంచి లాభాలొస్తాయని రైతులు ఆశించారు. కానీ.. కరోనా మహమ్మారి వారి ఆశలపై నీళ్లు చల్లింది. ప్రారంభంలో రూ.16 నుంచి రూ.20 పలికిన ఒక్కో అనాస కాయ ధర ప్రస్తుతం రూ.5 నుంచి రూ.6కు మించి పలకలేదు. చిన్న సైజు కాయలైతే కొనే నాథుడే లేకుండాపోయారు.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఐటీడీఏ, మార్కెటింగ్‌ శాఖ అనాస రైతుకు బాసటగా నిలిచాయి. రైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసి చిన్న సైజు కాయలను రూ.5, పెద్ద కాయలను రూ.10 చొప్పున 200 టన్నులకు పైగా అనాస పండ్లను సేకరించిన సీతంపేట ఐటీడీఏ వాటిని ఏజెన్సీతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో ఒక్కో సభ్యురాలికి ఒక్కో పండు వంతున రూ.5 సబ్సిడీపై పంపిణీ చేసింది. 

రవాణా సౌకర్యం..
మరోవైపు మార్కెటింగ్‌ శాఖ రంగంలోకి దిగి అనాస రైతులకు రైతు బజార్లలో స్థానం కల్పించి నేరుగా వారే పంటను అమ్ముకునేలా ఏర్పాట్లు చేసింది. వారికి అవసరమైన రవాణా సదుపాయాలను మార్కెటింగ్‌ శాఖ ఉచితంగా కల్పించింది. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని ప్రధాన రైతు బజార్లలో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ రైతు బజార్లలోని స్టాల్స్‌లో సుమారు 50 టన్నులకు పైగా అనాస పండ్లను రైతులు విక్రయించుకోగలిగారు.

కాయలు మంచి నాణ్యతతో ఉండటంతో వ్యాపారులు సైతం పోటీపడి వీరి నుంచి కొనుగోలు చేశారు. ఒక్కో కాయకు రూ.12 నుంచి రూ.15 వరకు గిట్టుబాటు కావడంతో రైతుల్లో ఆనందం అవధులు దాటింది. తమ జిల్లాలో ఒక్కో కాయ రూ.5కు మించి అమ్ముకోలేకపోయే వారమని, ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఒక్కో కాయకు రూ.10కి పైగా ధర వచ్చిందని రైతులు సంబరపడుతున్నారు.

రైతు బజార్లలో అమ్మకం
పైనాపిల్‌ ధర పతనమైందని తెలిసి సీతంపేట ఐటీడీఐ ఆధ్వర్యంలో కాయల్ని కొనుగోలు చేశారు. కాగా ఇంకా రైతుల వద్ద మిగిలి ఉన్న కాయలను అమ్ముకునేందుకు రైతు బజార్లలో ఏర్పాట్లు చేసాం. రైతులే స్వయంగా మార్కెట్లకు తెచ్చుకునేలా ఏర్పాట్లు చేశాం. వ్యాపారులు పోటీపడటంతో రైతులకు మంచి ధర వచ్చింది.
– శ్రీనివాసరావు, రైతుబజార్ల సీఈవో

ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేను
మాది సీతంపేట మండలం విజ్జయాగూడ గ్రామం. నేను మూడెకరాల్లో అనాస సాగు చేశా. ఈ ఏడాది ఊహించని రీతిలో అనాస కాయ ధర రూ.5కు పడిపోవడంతో కొనేనాథుడు లేకుండా పోయారు. ప్రభుత్వ చొరవతో ఈ రోజు ఒక్కో కాయ రూ.14కు అమ్ముకోగలిగా. రాజమండ్రి మార్కెట్‌కు 1,500 పండ్లు తీసుకొచ్చా. రూ.21 వేల ఆదాయం వచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేను. – సవర మసయ్య,విజ్జాయగూడ, శ్రీకాకుళం

ప్రభుత్వ చొరవతో గట్టెక్కాం
మూడెకరాల్లో మూడు టన్నుల దిగుబడి వచ్చింది. రేటు పడిపోవడంతో కాయ కొనేవాళ్లే కరువయ్యారు. దీంతో చాలా ఇబ్బందిపడ్డాం. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ రోజు 800 కాయల్ని విజయవాడ మార్కెట్‌కు తెచ్చా. రూ.11,200 ఆదాయం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది.
– ఎస్‌.పాపారావు, కుసిమిగూడ, శ్రీకాకుళం

మరిన్ని వార్తలు