వైఎస్సార్‌సీపీ జనాగ్రహ దీక్షలు

21 Oct, 2021 05:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాజకీయాల్లో దిగజారుడు విధానాలకు వ్యతిరేకంగా, ప్రతిపక్ష టీడీపీ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి బూతులు మాట్లాడటాన్ని నిరసిస్తూ ఈ నెల 21, 22 తేదీల్లో రెండు రోజులపాటు జనాగ్రహ దీక్షలకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. జనాగ్రహ దీక్షల నిర్వహణపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు బుధవారం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పార్టీ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రాలు సహా అన్ని జిల్లాల్లో ప్రధానమైన చోట్ల జనాగ్రహ దీక్షలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
(చదవండి: చంద్రబాబుపై జీవీఎల్‌ ఫైర్‌.. చేసిన తప్పులు ఒప్పుకోవాలని డిమాండ్‌)

ఈ దీక్షల్లో కేవలం పార్టీ శ్రేణులనే కాకుండా ప్రజాసంఘాలను, విద్యార్థులను, యువతను, కుల సంఘాలను, మేధావులను, పౌర సంఘాలను భాగస్వాముల్ని చేయాలన్నారు. రాజకీయాల్లో విలువలు పాటించాలని, హద్దుమీరి మాట్లాడి రాజకీయాలను దిగజార్చే విధానాలకు వ్యతిరేకంగా వారి సంఘీభావాన్ని పొందాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. మంచి రాజీకీయ వాతావరణం ఉండాలన్నదే అభిమతమని, విద్వేష వ్యాఖ్యలు, బూతు మాటలు మాట్లాడటం మంచి వాతావరణాన్ని కలుషితం చేస్తుందనే విషయాన్ని ఎలుగెత్తి చాటాలన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో అందరి సహకారం, సంఘీభావన్ని తీసుకోవాలని సూచించారు.  

మరిన్ని వార్తలు