వంట నూనెల హబ్‌.. 'కాకినాడ'.. గుజరాత్ తర్వాత రెండో స్థానం

7 Aug, 2022 10:28 IST|Sakshi

రాష్ట్రంలో మొదటి స్థానం

కాకినాడ పరిసరాల్లో 12 రిఫైనరీలు

దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలకు శుద్ధి చేసిన నూనెలు రవాణా 

ఏడాది పొడవునా     వేలాది మందికి ఉపాధి

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పెన్షనర్స్‌ ప్యారడైజ్‌గా పిలిచే కాకినాడకు వంట నూనెల హబ్‌గానూ పేరుంది. ఈ విషయంలో కాకినాడ.. గుజరాత్‌ తర్వాత దేశంలోనే రెండో స్థానంలో నిలుస్తోంది. అలాగే రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంటోంది. ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్, రష్యా తదితర దేశాల నుంచి ఇక్కడకు ముడి పామాయిల్‌ దిగుమతి అవుతోంది. ఇక్కడున్న 12 రిఫైనరీలలో ముడి వంట నూనెలను శుద్ధి చేసి పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. భవిష్యత్‌లో వచ్చే కాకినాడ గేట్‌వే పోర్టుతో పారిశ్రామికంగా ఈ రంగం మరింత పరుగులు తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం కూడా ఇందుకు దోహదం చేయనుందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. కాకినాడలో ప్రభుత్వ రంగ యాంకరేజ్‌ పోర్టు, ప్రైవేటు రంగంలో కేఎస్‌పీఎల్‌ (కాకినాడ సీపోర్ట్సు లిమిటెడ్‌) రెండు పోర్టులు ఉన్నాయి.  

పలు రాష్ట్రాల రిఫైనరీలు.. 
ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్‌ నుంచి ఏటా 9 లక్షల మెట్రిక్‌ టన్నుల క్రూడ్‌ పామాయిల్‌ను కాకినాడ సీపోర్ట్సుకు దిగుమతి చేసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చే ముడి నూనెలను ఓడ సముద్రతీరాన జట్టీలో ఉన్నప్పుడే నేరుగా రిఫైనరీకి తరలించే ప్రత్యేక ఏర్పాటు ఇక్కడ ఉంది. అందుకే పలు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రిఫైనరీల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. పోర్టు నుంచి రిఫైనరీలకు నేరుగా పైపులైన్లు ఉండటంతో సమయం, ఖర్చులు ఆదా అవుతున్నాయంటున్నారు. 

12 రిఫైనరీలలో శుద్ధి.. ప్యాకింగ్‌.. 
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్‌ పామాయిల్‌ను కాకినాడ పరిసరాల్లో వాకలపూడి, వలసపాకల, సూర్యారావుపేటలలో 12 రిఫైనరీలలో శుద్ధి చేసి ప్యాకింగ్‌ చేస్తున్నారు. అదానివిల్‌మార్, అగర్వాల్, లోహియా, జెమిని, అమ్మిరెడ్డి, రుచిసోయ, భగవతి, సంతోíÙమాత, శ్రీ గాయత్రి, వెంకట రమణ తదితర కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రిఫైనరీల్లో శుద్ధి చేసిన వంట నూనెలను వివిధ బ్రాండ్‌ల పేరుతోఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు తదితర రాష్ట్రాలకు ప్యాకింగ్‌ ఆయిల్, లూజు ఆయిల్‌గా రవాణా చేస్తున్నారు. రోజూ ట్యాంకర్ల ద్వారా 500 మెట్రిక్‌ టన్నుల ఆయిల్‌ (లూజు), 2,500 మెట్రిక్‌ టన్నులు లీటర్‌ చొప్పున ప్యాక్‌ చేసి ట్రక్కులలో కాకినాడ నుంచి పంపుతున్నారు. ప్రత్యక్షంగా సుమారు 20 వేల మంది, పరోక్షంగా 50 వేల మంది ఏడాది పొడవునా ఉపాధి 
పొందుతున్నారు.
చదవండి: ముర్రా.. మేడిన్‌ ఆంధ్రా

కాకినాడ తర్వాత కృష్ణపట్నం.. 
దేశవ్యాప్తంగా ప్రజల వినియోగానికి కోటి 40 లక్షల మెట్రిక్‌ టన్నుల వంట నూనెలు అవసరమని అంచనా. దేశీయంగా అందుబాటులో ఉండే వంట నూనెలు మినహాయిస్తే.. విదేశాల నుంచి 80 లక్షల మెట్రిక్‌ టన్నులు వరకు దిగుమతి అవుతున్నాయి. వీటిలో గుజరాత్‌లోని రెండు పోర్టులు ముడి వంట నూనెల దిగుమతిలో మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో రెండో స్థానంలో, రాష్ట్రంలో మొదటి స్థానంలో కాకినాడ పోర్టు ఉంది. దేశవ్యాప్తంగా దిగుమతి అవుతున్న ముడి వంట నూనెల్లో 20 శాతం రాష్ట్రంలోని పోర్టులకు దిగుమతి అవుతున్నాయి. కాకినాడ సీపోర్టు ద్వారా ఏటా 9 నుంచి 10 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కాకినాడ తర్వాత రెండో స్థానాన్ని కృష్ణపట్నం పోర్టు దక్కించుకుంటోంది.  

క్రియాశీలకంగా కాకినాడ సీపోర్టు.. 
క్రూడ్‌ పామాయిల్‌ దిగుమతిలో కాకినాడ సీపోర్టు క్రియాశీలకంగా ఉంది. పోర్టు నుంచి నేరుగా రిఫైనరీల వరకు పైపులైన్‌ ఉండటంతో ముడి నూనె ఎటువంటి వృథా కాకుండా రవాణా అవుతుండటం కంపెనీలకు కలిసివస్తోంది.  
–ఎన్‌.మురళీధరరావు, సీఈవో, కాకినాడ సీపోర్టు లిమిటెడ్‌ 

రవాణా రంగానికి ఊపిరి.. 
కాకినాడ సీపోర్టును ఆనుకుని పలు ఆయిల్‌ రిఫైనరీలు నిర్వహిస్తుండటంతో రవాణా రంగానికి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. డ్రైవర్లు, ట్రక్‌ యజమానులు, క్లీనర్లు తదితరులు వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. 
– బావిశెట్టి వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు, లారీ ట్యాంకర్స్‌ యూనియన్, కాకినాడ

మరిన్ని వార్తలు