బియ్యం పంపిణీపై జీవీఎల్‌ వ్యాఖ్యలు అర్థరహితం: మంత్రి కారుమూరి

23 May, 2022 19:43 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాజ్యసభ సభ్యులు జీవీఎల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హితవు పలికారు. బియ్యం పంపిణీపై జీవీఎల్‌ వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడారు.. ఏపీలో పూర్తిగా నూకల్లేని సన్న బియ్యం (సార్టేక్స్) బియ్యం ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చిన  నాన్ సార్టెక్స్ బియ్యాన్ని పంపిణీ చేస్తే సరిపోదని అన్నారు. అంతేగాక కేంద్రం సార్టెక్స్ బియ్యం ఇవ్వకపోగా నాన్ సార్టెక్స్ బియ్యం ఇస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం తీరు వల్లే ఉచిత బియ్యం పంపిణీ చేయలేకపోతున్నామన్నారు. 

ఈ విషయంపై నీతి ఆయోగ్‌కు లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. తాము 1.46 కోట్ల మంది లబ్ధిదారులకు బియ్యం ఇస్తుంటే ఏపీలో సగం జనాభాకే ( 86 లక్షల మందికి) ఇస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రాలైన కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, రాజస్తాన్‌, మహారాష్ట్ర మాత్రం అధికంగా ఇస్తున్నారని దుయ్యబట్టారు. దీనిపై ప్రధానికి కూడా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మే 16న లేఖ రాశారని గుర్తు చేశారు.  

‘రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే ఆ బియ్యాన్ని తెచ్చే ఏర్పాటు చేయండి. కేంద్రంలో మీరే ఉన్నారు కాబట్టి మాకు రావాల్సింది ఇప్పించండి. మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. మీరు ఇప్పుడైనా రావాల్సిన బియ్యం కోసం లేఖ రాయండి. ప్రజలకు మీరిచ్చే అర్థ బంతి బోజనాలు మేము పెట్టలేము. నీతి ఆయోగ్ సిఫార్సులను వెంటనే అమలయ్యేలా మీరు కృషి చేయండి. మేము సిద్దంగా ఉన్నాం...మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. సీఎం దావోస్‌ పర్యటనలో ఉన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు.’ అని తెలిపారు.
చదవండి: తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవు: మంత్రి అంబటి

మరిన్ని వార్తలు