ఒక దశలో రాజీనామా చేయాలనుకున్నా: మండలి చైర్మన్‌ భావోద్వేగం

20 May, 2021 19:07 IST|Sakshi

సాక్షి, అమరావతి:  ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. ఈ నెల‌తో మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్ ప‌ద‌వీకాలం ముగియ‌నుండ‌టంతో.. స‌మావేశాల అనంత‌రం ఆయ‌న‌కు వీడ్కోలు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ.. తన పదవి ముగుస్తోందని, సభ్యులతో కొన్ని విషయాలు పంచుకోవాలన్నారు. తనకు ఈ పదవి ఎవరో ఇచ్చారని అనుకోవడం లేదని, రాజధానుల బిల్లు సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. ఒక దశలో రాజీనామా చేద్దామని నిర్ణయించుకున్నానని, కానీ పదవి వల్ల తనకు చెడ్డపేరు రాకూడదని ఆగిపోయినట్లు పేర్కొన్నారు. అందరినీ ఒప్పించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు.

‘అందరూ నాకు సహనం ఎక్కువ అంటున్నారు. కానీ నాకంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సహనం ఎక్కువ. బిల్లు ఘటన జరిగిన 3 రోజులకు ఓ కార్యక్రమంలో సీఎంను కలిశా. జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా హై టీ కార్యక్రమంలో కలిశా. సీఎం జగన్‌ చాలా అప్యాయంగా షరీఫ్‌ అన్న అని పలకరించారు. ఎందుకు కలత చెందారని స్వయంగా అడిగారు. గతంలో ఏ పెద్ద పదవులు చేయలేదు, నేరుగా ఛైర్మన్‌ అయ్యానని చెప్పాను. మండలిలో కీలక నిర్ణయాల దృష్ట్యా కలత చెందానని సీఎంకు చెప్పా. నన్ను అత్యంత గౌరవంగా చూసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు’ అని భావోద్వేగానికి లోనయ్యారు.

చదవండి: ‘సీఎం రైతు పక్షపాతి అనడానికి వ్యవసాయ బడ్జెట్‌ నిదర్శనం’
AP Budget 2021: ఏపీ బడ్జెట్‌ హైలైట్స్‌ ఇవే..

మరిన్ని వార్తలు