ఫ్యాన్‌టాస్టిక్‌ విక్టరీ

20 Sep, 2021 04:11 IST|Sakshi

పరిషత్‌ పోరులో వైఎస్సార్‌ సీపీ ప్రభం‘జనం’

జగన్‌ సంక్షేమ పాలనకు బ్రహ్మరథం

ఖాయమైన జెడ్పీ పీఠం

మండల పరిషత్‌లలోనూ ఫ్యాన్‌ గాలి హోరు

గత ఫలితాలే పునరావృతం

యనమల, నిమ్మకాయల, వేగుళ్లకు చుక్కెదురు

టీడీపీ, జనసేన అపవిత్ర కలయికపై కన్నెర్ర 

అదే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌.. మొన్న పంచాయతీ.. నిన్న మున్సిపాలిటీ.. నేడు పరిషత్‌.. ఎన్నిక ఏదైనా గెలుపు వైఎస్సార్‌ సీపీదే. సంక్షేమ యజ్ఞంతో ఉజ్వల భవితకు భరోసా ఇస్తున్న జగనన్న పాలనకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే పరిషత్‌ ఎన్నికల్లో సై‘కిల్‌’ కాగా, గ్లాసు బీటలు తీసింది. కమలం మరీ వాడిపోయింది. టోటల్‌గా సార్వత్రిక ఎన్నికల సీన్‌ రిపీట్‌ అయింది. 

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పరిషత్‌ పోరులోనూ పల్లె ప్రజలు వైఎస్సార్‌ సీపీకే బ్రహ్మరథం పట్టారు. జగన్‌ సంక్షేమ పాలనకు “జై’ కొట్టారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ఏకపక్ష గెలుపుతో వైఎస్సార్‌ సీపీ జిల్లాలో ప్రభంజనం సృష్టించింది. మెజారిటీ జిల్లా, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల్లో (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఆ పార్టీ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. కడపటి వార్తలు అందేసరికి జిల్లాలోని దాదాపు అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో వైఎస్సార్‌ సీపీ జెండా రెపరెపలాడేలా ఓటర్లు తీర్పు ఇచ్చినట్టు స్పష్టమైంది.

జిల్లా పరిషత్‌ పీఠాన్ని వైఎస్సార్‌ సీపీ అధిష్టించడం ఖాయమైపోయింది. మొత్తం 61 జెడ్పీటీసీలకు గానూ అత్యధిక స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. ఫలితాలు వెల్లడి కావాల్సిన వాటిల్లో దాదాపు అన్నిచోట్లా విజయతీరాలకు దూసుకుపోతున్నారు. ఎన్నికలు జరిగిన 996 ఎంపీటీసీ స్థానాల్లో 90 శాతం విజయాలతో వైఎస్సార్‌ సీపీ తిరుగులేని మెజార్టీ సాధించే దిశగా పయనిస్తోంది. ఎన్నికల కంటే ముందు ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాల్లో సైతం మెజార్టీ స్థానాలు (77) వైఎస్సార్‌ సీపీ పరమయ్యాయి.

తిరుగులేని ఈ ఫలితాలు పార్టీ శ్రేణులకు బూస్ట్‌ అందించాయి. ఈ ఫలితాల ద్వారా ప్రభుత్వానికి జిల్లా ప్రజలు మరోసారి మద్దతుగా నిలిచినట్టయ్యింది. ప్రతి ఇంటా రెండు మూడు సంక్షేమ పథకాలు అందుకుంటున్నందుకు గానూ ప్రజలు ప్రభుత్వ రుణాన్ని ఓట్ల రూపంలో తీర్చుకున్నారు. తుని నియోజకవర్గంలో 63 ఎంపీటీసీ స్థానాలకు గానూ 60 చోట్ల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులే విజయఢంకా మోగించారు. రాజానగరం నియోజకవర్గంలో 57కు 50 చోట్ల ‘ఫ్యాన్‌’ గాలి హోరెత్తింది. అనపర్తిలో 76కు 68 చోట్ల, పెద్దాపురంలో 44కు 37 చోట్ల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం.

‘ఫ్యాన్‌’కే మన్యసీమ మద్దతు 
పార్టీ ఆవిర్భావం నుంచీ వెన్నంటి నిలిచినట్టే ఈ ఎన్నికల్లో సైతం మన్యసీమ బిడ్డలు వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా నిలిచారు. ఏజెన్సీని ఆ పార్టీ కంచుకోటగా నిలిపారు. టీడీపీని మట్టి కరిపించారు. రాష్ట్ర విభజన తరువాత విలీన మండలాల్లో తొలిసారి పార్టీ పరంగా జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో ఆ మండలాల ప్రజలు వైఎస్సార్‌ సీపీకి తిరుగులేని ఆధిక్యతను కట్టబెట్టారు.

ఇక్కడ నాలుగు మండలాలకు గానూ టీడీపీకి వీఆర్‌ పురం ఒక్కటే దక్కింది. కూనవరం, చింతూరు, ఎటపాక జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌ సీపీ కైవసం చేసుకుంది. డివిజన్‌ కేంద్రం రంపచోడవరం సహా గంగవరం, దేవీపట్నం, అడ్డతీగల, వై.రామవరం తదితర జెడ్పీటీసీలతో పాటు మండల పరిషత్‌ పీఠాలను కూడా వైఎస్సార్‌ సీపీ గెలుచుకుంది.  

కోనసీమలోనూ అదే ప్రభంజనం 
కోనసీమలో సైతం వైఎస్సార్‌ సీపీ ప్రభంజనమే కొనసాగుతోంది. అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట నియోజకవర్గాల్లో 16 మండల పరిషత్‌లు, జెడ్పీటీసీ స్థానాల్లో దాదాపు అన్నింటా వైఎస్సార్‌ సీపీ దూసుకుపోతోంది. ఈ 16 మండలాల్లో మొత్తం 305 ఎంపీటీసీలకు 90 శాతం స్థానాల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసే దిశగా పరుగులు తీస్తోంది. మరోపక్క మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్, రామచంద్రపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ అప్రతిహతంగా పయనిస్తోంది. 

కుప్పకూలిన ‘దేశం’ కంచుకోటలు 
తెలుగుదేశం పార్టీకి ఒకప్పటి కంచుకోటలన్నీ వైఎస్సార్‌ సీపీ హోరుగాలిలో నిలవలేక పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఏజెన్సీ, కోనసీమ, మెట్ట అనే వ్యత్యాసం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్సార్‌ సీపీ విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినప్పటికీ తెలుగు తమ్ముళ్లు జనసేనతో అపవిత్ర పొత్తు పెట్టుకుని బరిలో నిలిచారు. ఈ రెండు పార్టీలూ అంతర్గత ఒప్పందం చేసుకుని బరిలో దిగినా జిల్లా ప్రజలు మాత్రం వారి అపవిత్ర కలయికను చీల్చి చెండాడారు.

టీడీపీలో కాకలు తీరిన యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప వంటి నేతలు సైతం సొంత మండలాల్లో బోర్లా పడ్డారు. ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీ ఉనికి కోసం పాకులాడటం కనిపించింది. ఆ ఇద్దరు నేతలూ కనీసం ఒక్క జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాన్ని కూడా దక్కించుకోలేక చేతులెత్తేశారు. టీడీపీలో నంబర్‌–2గా పిలిపించుకునే యనమల రామకృష్ణుడు స్వగ్రామం ఏవీ నగరంలో టీడీపీ కుప్పకూలిపోయింది. అక్కడ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి 1,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం.

చినరాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురంలో అన్నింటా వైఎస్సార్‌ సీపీ హవానే కొనసాగుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలైన తుని, రాజానగరం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, మండపేట నియోజకవర్గాల్లో సైతం ప్రజలు ఆ పార్టీని కూకటివేళ్లతో సహా పెకలించివేశారు. ఆయా నియోజకవర్గాల్లోని జెడ్పీటీసీ, అత్యధిక ఎంపీపీ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ జోరు కొనసాగింది.

మరిన్ని వార్తలు