Guntur: ఫ్యాన్‌ ప్రభంజనం

19 Sep, 2021 11:28 IST|Sakshi

పరిషత్‌ ఎన్నికల్లోనూ టీడీపీ చిత్తు  

దేశం కంచుకోటల్లో సంక్షేమ జయకేతనం  

జెడ్పీలో కొలువుదీరనున్న ఏకైక పక్షం

చరిత్రలో సరికొత్త సువర్ణాధ్యాయం

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌ సీపీ మరోమారు ప్రభంజనం సృష్టించింది. పరిషత్‌ ఎన్నికల్లో జయభేరి మోగించింది. తనకు ఎదురు లేదని నిరూపించింది. ఫ్యాన్‌ ధాటికి తెలుగుదేశం పార్టీ చిత్తయింది. మొదటి నుంచి ఆ పార్టీకి కంచుకోటైన గుంటూరు జిల్లాలోనే సైకిల్‌ తుక్కుతుక్కు అయింది.   2019 సాధారణ ఎన్నికల నుంచి ప్రారంభమైన టీడీపీ పతనం పరిషత్‌ ఎన్నికలతో సంపూర్ణమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పంచాయతీ, పురపాలకసంఘ ఎన్నికల్లోనూ టీడీపీ ఘోరపరాభవాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.   

జెడ్పీపై జయకేతనం  
జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలన్నింటినీ వైఎస్సార్‌ సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. జిల్లా పరిషత్‌పై జయకేతనం ఎగురవేసింది. ఎంపీటీసీ స్థానాల్లోనూ పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. ఒక్క దుగ్గిరాల తప్ప అన్ని మండల పరిషత్‌లనూ కైవసం చేసుకుంది. 


టీడీపీ సున్నా 
2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 23 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకోగా, టీడీపీ 34 స్థానాలు గెలిచి జిల్లా పరిషత్‌ను గెలుచుకుంది. 2021కి వచ్చే సరికి సీన్‌  రివర్స్‌ అయ్యింది. ఎన్నికలు జరిగిన, ఏకగ్రీవమైన మొత్తం 53 జెడ్పీటీసీ స్థానాలన్నింటినీ వైఎస్సార్‌ సీపీ గెలుచుకుంది.  టీడీపీ గుడ్డుసున్నాగా మిగిలిపోయింది. ఎన్నికలు జరిగిన, ఏకగ్రీవమైన మొత్తం 797 ఎంపీటీసీ స్థానాల్లో 709  వైఎస్సార్‌ సీపీ గెలుచుకోగా, టీడీపీ 61కి పరిమితమైంది. జనసేన అభ్యర్థులు 11, ఒక స్థానంలో సీపీఐ అభ్యరి్థ, 15 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. 

అంతకు మించి..  
ఇటీవల 973 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 768 వైఎస్సార్‌ సీపీ, 176 టీడీపీ, 17 జనసేన, 12 ఇతర అభ్యర్థులు చేజిక్కించుకున్నారు. 78.93శాతం సర్పంచ్‌ పదవులను అధికారపార్టీ దక్కించుకుంది. టీడీపీ 18.08 శాతానికి పరిమితమైంది. ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికల్లో అంతకుమించి విజయాన్ని వైఎస్సార్‌ సీపీ దక్కించుకుంది. 88.83 శాతం స్థానాల్లో పాగా వేసింది. టీడీపీ 7.65 శాతానికి పడిపోయింది.    

మాచర్లలో క్లీన్‌ స్వీప్‌ 
మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ  క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం  71 ఎంపీటీసీ స్థానాలు ఉంటే ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కృషితో 70 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దుర్గి మండలం ధర్మవరం గ్రామంలోని ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నిక జరిగింది. ఇప్పుడు ఆ స్థానంలోనూ  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అరిగల గోవిందమ్మ గెలుపొందడంతో మొత్తం క్లీన్‌ స్వీప్‌ చేసినట్టయింది. ఇదిలా ఉంటే మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి జెడ్పీటీసీ స్థానాలన్నీ గతంలోనే ఏకగ్రీవంగా వైఎస్సార్‌ సీపీ కైవసం చేసుకుంది.

చదవండి: MPTC, ZPTC elections results: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్ర యాత్ర

మరిన్ని వార్తలు