Visakhapatnam: విశాఖపట్నం జిల్లాలో వైఎస్సార్‌సీపీ హవా

19 Sep, 2021 11:22 IST|Sakshi

37 స్థానాల్లో 35 కైవసం 

ఏకగ్రీవంతో కలుపుకుని 36 చోట్ల విజయకేతనం 

ఒక స్థానానికే పరిమితమైన టీడీపీ 

అనంతగిరి జెడ్పీటీసీని దక్కించుకున్న సీపీఎం 

611 ఎంపీటీసీల్లో 450 స్థానాలూ అధికారపార్టీవే 

ఏకగ్రీవాలు కలుపుకుని 486 స్థానాల్లో ఫ్యాన్‌ హవా 

ఎంపీపీలన్నీ ఆ పార్టీ ఖాతాలోకే.... 

యలమంచిలి నియోజకవర్గంలో క్లీన్‌స్వీప్‌ 

4 జెడ్పీ స్థానాలు, 58 ఎంపీటీసీలలో విజయదుందుభి

రెండేళ్ల క్రితం మొదలైన వైఎస్సార్‌సీపీ ప్రభంజనం అదే హోరు.. అదే జోరుతో కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన అధికార పార్టీ.. పరిషత్‌ పోరులోనూ ప్రజల మద్దతుతో విజయ దుందుభి మోగించింది.  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  పరిపాలన రాజధాని విశాఖ జెడ్పీ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడింది. జిల్లాలో మొత్తం 39 జెడ్పీటీసీ స్థానాలుండగా రెండు స్థానాలను మినహాయించి (ఒకటి ఏకగ్రీవం, మరొక స్థానంలో బరిలో ఉన్న అభ్యర్థి మరణించడంతో) 37 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏకంగా 35 స్థానాలను అధికార వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. మిగిలిన రెండు స్థానాల్లో ఒకచోట టీడీపీ గెలువగా... మరో స్థానాన్ని సీపీఎం చేజిక్కించుకుంది. జిల్లా జెడ్పీ పీఠంపై ఎస్టీ మహిళ వైఎస్సార్‌సీపీ తరపున ఆసీనులు కానున్నారు.

ఇక 39 మండలాల్లో 651 ఎంపీటీసీ స్థానాలకుగానూ 612 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్‌ పేపర్లు వర్షపు నీటితో దెబ్బతినడంతో ఒక స్థానంలో (పాకలపాడు) కౌంటింగ్‌ నిలిపివేయగా.... 611 స్థానాల్లో మాత్రమే లెక్కింపు జరిపారు. వీటిలో 450 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, 118 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక బీజేపీ 6, సీపీఎం 3, కాంగ్రెస్‌ 2, సీపీఐ 2, జనసేన 2, స్వతంత్రులు 28 స్థానాల్లో గెలుపొందారు. వీటికి గతంలో వైఎస్సార్‌సీపీ ఖాతాలో పడిన 36 ఏకగ్రీవాలు కలుపుకుంటే ఆ పార్టీ అభ్యర్థులు మొత్తం 486 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. యలమంచిలి నియోజకవర్గంలోని అన్ని స్థానాలను వైఎస్సార్‌సీపీనే క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఆ నియోజకవర్గంలోని 4 జెడ్పీ స్థానాలతో పాటు 58 ఎంపీటీసీలూ ఆ పార్టీ ఖాతాలోకే చేరాయి. ఫలితంగా ఈ నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో టీడీపీకి కనీసం ప్రాతిని«థ్యమే లేకుండా పోయింది. ఇక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహించిన నర్సీపట్నంతోపాటు మరో సీనియర్‌ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సొంత నియోజకవర్గం పెందుర్తిలోనూ ఆ పార్టీకి చావుదెబ్బ తగిలింది. ఒకవైపు జెడ్పీ పీఠాన్ని తిరుగులేని మెజార్టీతో దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ.... అదే ఊపుతో అన్ని ఎంపీపీలనూ కైవసం చేసుకోనుంది.  

అయ్యన్న ఇలాకాలో...! 
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహించిన నర్సీపట్నంలోనూ ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. అయితే, చావుతప్పి కన్నులొట్టపోయినట్టు 4 జెడ్పీటీసీ స్థానాల్లో ఒకటి దక్కించుకోగా... మిగిలిన మూడింటిలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరింది. ఇక ఎంపీటీసీ స్థానాల్లో 58 స్థానాలకుగానూ 57లోనే కౌంటింగ్‌ జరిగింది. ఇందులో ఏకంగా 43 వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరాయి. టీడీపీ 14 స్థానాలకే పరిమితమయ్యింది. అంతేకాకుండా నియోజకవర్గంలోని అన్ని ఎంపీపీలనూ వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంది. ఇక మరో టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పెందుర్తిలోనూ వైఎస్సార్‌సీపీనే విజయఢంకా మోగించింది. నియోజకవర్గంలోని 3 జెడ్పీలనూ వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. 42 ఎంపీటీసీలలో... 34 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడింది. ప్రధానంగా

గిరిజన ప్రాంతాల్లో మరోసారి 
వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని నిరూపితమైంది. ఇక యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ తరపున స్థానిక సంస్థల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాతినిథ్యం వహించే పరిస్థితి లేకుండా పోయింది.  

ప్రభావం చూపించని బీజేపీ, జనసేన 
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కేవలం సీపీఎం మాత్రమే ఒక జెడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకుంది. ఎంపీటీసీ స్థానాల్లో కూడా బీజేపీ–6, జనసేన–2 సీపీఎం–3, సీపీఐ–2, కాంగ్రెస్‌–2 స్థానాలకే పరిమితమయ్యాయి. అయితే, ఈ పార్టీలన్నింటికీ కలుపుకుని 15 ఎంపీటీసీలు రాగా..... స్వతంత్ర అభ్యర్థులు 28 ఎంపీటీసీలను చేజిక్కించుకోవడం గమనార్హం.  

ఉదయం నుంచే కౌంటింగ్‌....! 
ఈ ఎన్నికల్లో 5,76,725 మంది పురుషులు, 5,96,872 మంది మహిళలు (మొత్తం 11,73,601 మంది) ఓటింగులో పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్‌ను 1,282 మంది అధికారులు పర్యవేక్షించగా, 3,573 మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. మొత్తం 39 కేంద్రాల్లో కౌంటింగ్‌ జరిగింది. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యింది. కౌంటింగ్‌ పర్యవేక్షణకు ఎన్నికల సంఘం నియమించిన ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌తో పాటు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఉదయం నుంచే కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా కౌంటింగ్‌ సాగేలా చూశారు.

పాకలపాడులో కౌంటింగ్‌ నిలిపివేత 
పాకలపాడు ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికకు కౌంటింగ్‌ నిలిపివేశారు. బ్యాలెట్‌ బాక్సులోకి వర్షపునీరు చేరి బ్యాలెట్‌ పేపరు దెబ్బతినడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కౌంటింగ్‌ నిలిపివేశారు. ఇక గొలుగొండ జెడ్పీ స్థానంలో వైఎస్సార్‌సీపీకి 6,900 మెజార్టీ ఉంది. అయితే, ఇంకా ఓట్లు లెక్కించాల్సిన బ్యాలెట్‌ బాక్సులో కేవలం 1,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మెజార్టీ లెక్కించాల్సిన ఓట్ల కంటే ఎక్కువగా ఉండటంతో ఈ స్థానం వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరింది.  

పీఠం నుంచి పాతాళానికి...! 
వాస్తవానికి విశాఖపట్నం జిల్లాలో గతంలో టీడీపీ ఆధిపత్యం సాగించేది. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 39 జెడ్పీ స్థానాల్లో 25 చోట్ల టీడీపీ గెలుపొందగా, 14 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జెడ్పీ పీఠాన్ని టీడీపీ చేజిక్కించుకుంది. ఏడేళ్ల తర్వాత జరిగిన స్థానిక పోరులో టీడీపీ 25 స్థానాల నుంచి కేవలం ఒకే ఒక స్థానానికే పరిమితమైపోయింది. ఎంపీటీసీ స్థానాల్లోనూ.. 2014లో 341 స్థానాలు రాగా ఇప్పుడు 118 స్థానాలకు పరిమితమైపోయింది. మరోవైపు కొన్ని స్థానాల్లో కనీసం రెండో స్థానంలో కూడా టీడీపీ నిలువలేకపోయింది. పరిపాలన రాజధానిగా విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. టీడీపీ నేతలు వారి అధినేత నిర్ణయానికి అనుగుణంగా అమరావతికే మద్దతు పలికారు తప్ప విశాఖపట్నానికి అనుకూలంగా ఒక్కమాట మాట్లాడలేదు. అంతేకాకుండా రోజుకు ఒకటి చొప్పున టీడీపీ నేతల అవినీతి వ్యవహారం బయటకు వస్తుండటంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకతనే ఇప్పుడు ఓట్ల రూపంలో వారి చెంప చెళ్లుమనిపించారని అర్థమవుతోంది.  

మరిన్ని వార్తలు