అవసరం మేరకు ఆస్పత్రుల పెంపు

25 Mar, 2021 04:11 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌పై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం

ప్రస్తుతం 51 ఆస్పత్రుల్లో కోవిడ్‌ సేవలు

సాక్షి, అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో అవసరాన్ని బట్టి ఆస్పత్రులను పెంచడంపై కసరత్తు చేస్తోంది. రోజువారీ వస్తున్న పాజిటివ్‌ కేసులు, చికిత్స పొందుతున్న కేసుల(యాక్టివ్‌ కేసులు)ను పరిగణనలోకి తీసుకుని వాటి ఆధారంగా కోవిడ్‌ సేవలను అందించేలా ఆస్పత్రులను సమాయత్తం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 51 ఆస్పత్రుల్లో కోవిడ్‌ సేవలను అందిస్తున్నారు. వీటిల్లో 5,074 పడకలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి 2,616 యాక్టివ్‌ కేసులు ఉండగా, 339 పడకలను మాత్రమే వాడుతున్నారు.

ఎక్కువమంది హోం ఐసోలేషన్‌లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కేవలం 42 మందే ఆస్పత్రుల్లో చేరారు. అయితే కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రులను సమాయత్తం చేయడంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. 2020 జూలై, ఆగస్ట్‌ నెలల్లో వైరస్‌ తీవ్రతను బట్టి ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి సుమారు 208 ఆస్పత్రుల్లో కోవిడ్‌ సేవలు అందించిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లోనూ పరిస్థితులను బట్టి ఆస్పత్రులు, పడకల సంఖ్య పెంచుకుంటూ వెళతామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇందుకు వీలుగా రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కలిపి 243 ఆస్పత్రులను గుర్తించారు. 17,341 పడకలు, అదే సమయంలో భారీగా 3,181 వెంటిలేటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు.  

>
మరిన్ని వార్తలు