ఏపీ వైద్య శాఖ కృషి.. హైరిస్క్‌ గర్భిణులపై ప్రత్యేక దృష్టి 

27 Jan, 2023 04:28 IST|Sakshi

డెలివరీ డేట్‌కు వారం ముందే పెద్దాస్పత్రికి తరలింపు 

గత నెల 15 నుంచి ప్రారంభించిన వైద్య శాఖ  

సాక్షి, అమరావతి: హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ అనేది మాతృ మరణాలకు ప్రధాన కారణం. రక్తహీనత, చిన్న వయసులో గర్భం దాల్చడం, 2 లేక 3 అబార్షన్‌ల అనంతరం గర్భం దాల్చడం, ఎక్కువ కాన్పులు, అధిక బీపీ, గుండె, కిడ్నీ జబ్బులు, ఇతర సమస్యలతో గర్భం దాల్చిన మహిళలను హైరిస్క్‌గా పరిగణిస్తారు. వీరికి ప్రసవం సమయంలో ఇతర ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తుతుంటాయి.

ఈ క్రమంలో ప్రసవానికి ముందే వీరిని పెద్దాస్పత్రులకు తరలించడం ద్వారా ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు వైద్య శాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని హైరిస్క్‌ గర్భిణిలను డెలివరీ డేట్‌కు సుమారు వారం రోజుల ముందే సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాస్పత్రులకు తరలించే కార్యక్రమాన్ని గత నెలలో ప్రారంభించారు.

ఇందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. గత నెల 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు 5,398 మందిని తరలించగా.. 4,678 మంది సురక్షితంగా ప్రసవించారు. వీరిలో 332 మంది సీహెచ్‌సీల్లో, 447 మంది ఏరియా, 535 మంది జిల్లా ఆస్పత్రుల్లో, 916 మంది బోధనాస్పత్రుల్లో, 147 మంది ఎంసీహెచ్‌ సెంటర్‌లలో, మిగిలిన వారు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ప్రసవం నిర్వహించారు.  

పక్కా ప్రణాళికతో తరలింపు 
ప్రసవానికి సిద్ధంగా ఉన్న హైరిస్క్‌ గర్భిణుల వివరాలను ఏఎన్‌ఎం యాప్‌ ద్వారా ఏఎన్‌ఎంలకు పంపుతున్నారు. ఈ క్రమంలో వారు స్థానిక పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌తో కలిసి తమ పరిధిలోని హైరిస్క్‌ గర్భిణులను ఏ ఆస్పత్రికి తరలించాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఆ మేరకు ప్రసవానికి ముందే గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తారు.

ఈ ప్రక్రియపై రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన మెటర్నల్‌ మానిటరింగ్‌ సెల్‌ నుంచి పర్యవేక్షణ ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే నెల 21వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 8,384 మంది హైరిస్క్‌ గర్భిణులు ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు. వీరి వివరాలను ఇప్పటికే ఏఎన్‌ఎం యాప్‌లో పొందుపరిచారు. తద్వారా వీరిలో ఇప్పటికే 592 మంది గర్భిణులను పెద్దాస్పత్రులకు తరలించారు.

మరో 7,792 మందిని ఆస్పత్రులకు తరలించాల్సి ఉంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఏటా 8 లక్షల మందికిపైగా గర్భిణులు ఆర్సీహెచ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ అవుతుంటారు. వీరిలో 10 శాతం మంది హైరిస్క్‌లో ఉంటున్నారు. ఈ లెక్కన నెలకు 5 వేల వరకు హైరిస్క్‌ గర్భిణుల ప్రసవాలు జరుగుతుంటాయి.

మరిన్ని వార్తలు