‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే భారీగా అక్రమ మైనింగ్’

19 Aug, 2021 11:14 IST|Sakshi

గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి

సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని వెల్లడించారు. దానివల్ల రూ.230 కోట్లకుపైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని, 2014 నుంచి 2019 వరకు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్‌ తెరలేపారని అన్నారు. ఆండ్రూస్‌ మైనింగ్ సంస్థ అక్రమ మైనింగ్ చేసినట్లు ప్రాథమిక నిర్ధారణ అయిందని తెలిపారు. టీడీపీ నేతలతో ఆండ్రూస్‌ మైనింగ్ సంస్థకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు.

అక్రమంగా 2లక్షల టన్నుల మైనింగ్ చేసినట్టు నిర్ధారించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆండ్రూస్‌ మైనింగ్‌ సంస్థకు రూ.12.5 కోట్ల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వేదాంత, విదేశాలకు సరఫరా చేయడంతో బాక్సైట్‌ తవ్వినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు డీఎంఎల్‌ విచారణ చేశామని తెలిపారు. ఇప్పుడు మైనింగ్ జరిగిన ప్రాంతంలో విచారిస్తున్నామని,  డ్రోన్ ద్వారా సర్వే మొదలుపెట్టామని పేర్కొన్నారు. వందల కోట్లు అక్రమాలు జరిగాయని, వాటన్నింటి పైనా ఇప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. తమ శాఖ అధికారుల పాత్ర ఉన్నా సరే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
 చదవండి:  లేటరైట్‌ కొండలను పరిశీలించిన విశాఖ కలెక్టర్‌

మరిన్ని వార్తలు