‘ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవటం కాదు’.. అనురాగ్‌ ఠాగూర్‌పై నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి

21 Aug, 2022 17:55 IST|Sakshi

తాడేపల్లి: విజయవాడలో పర్యటించిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు మంత్రి జోగి రమేష్‌. సుజనా చౌదరి టీడీపీ ఆఫీసు నుంచి తెచ్చిన స్క్రిప్టుని బీజేపి నేత అనురాగ్ ఠాగూర్ చదివారని.. అసలు అనురాగ్‌కి ఏపీ గురించి, ఇక్కడి ప్రభుత్వం గురించి ఏం తెలుసు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ మూడేళ్లలో రెండు లక్షల మంది యువతకి రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 90 వేలమందికి ఔట్ సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పించామన్నారు. ఇవేమీ తెలుసుకోకుండా టీడీపీ ఇచ్చిన స్క్రిప్టు చదివితే సరిపోతుందా? అని ధ్వజమెత్తారు. మతతత్వ రాజకీయాలతో రాష్ట్రంలో ఎదగాలని ఆశ పడుతున్నారని ఆరోపించారు.  

‘యువతకు ఉద్యోగాలు లేవన్న అంశంపై చర్చకు వస్తారా? ఢిల్లీ నుంచి రావటం, ఎవరో ఇచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లటం కాదు. మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా 2 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇచ్చారా? దమ్ముంటే చర్చకు వచ్చి సమాధానం చెప్పాలి. కరోనా కష్ట కాలంలో కూడా వాలంటీర్లతో సంక్షేమం అందించాం. రాష్ట్రంలో దోపిడీ చేసింది ఎవరు? రాష్ట్రంలో మీరు పెంచి పోషించిన చంద్రబాబు దోచుకున్నారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబు. అసలు మీకు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత ఉందా? ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారు. పోలవరం పూర్తి చేస్తామని చెప్పి నిలువునా మోసం చేశారు. హామీ ఇచ్చిన యూనివర్సిటీలు, లోటు బడ్జెట్ నిధులు ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో మతతత్వ చిచ్చు పెట్టాలని చూస్తున్నారా? మా రాష్ట్రాన్ని మోసం చేసిన మీకు ఏం చూసి ఓటెయ్యాలి? మీరు ఒక్క ఎమ్మెల్యే సీటు కాదుకదా.. వార్డు సభ్యునిగా కూడా గెలవలేరు.’ అని అనురాగ్‌ ఠాగూర్‌పై ధ్వజమెత్తారు మంత్రి జోగి రమేష్‌. 

పవన్ కళ్యాణ్‌కి కనీసం అన్ని సీట్లలో పోటీ చేస్తానని చెప్పే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్‌. వైఎస్‌ జగన్ సీఎం అయినందుకు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అసలు పవన్‌కి కౌలు రైతులు, వ్యవసాయం అంటే ఏంటో తెలుసా? చెప్పాలన్నారు. 2014లో జనసేనని టీడీపీకి తాకట్టు పెట్టారని.. 2024లో కూడా అదే చేస్తారని విమర్శించారు. తన ప్యాకేజీ తీసుకుని పవన్ వెళ్ళిపోతారని.. కులాలను రెచ్చగొట్టే తెగులు చంద్రబాబు, పవన్‌దేనన్నారు. అందుకే గత ఎన్నికలలో వారికి ప్రజలు తగిన బుద్ది చెప్పారని గుర్తు చేశారు. 2024లో 175 సీట్లు  వైఎస్‌ఆర్‌సీపీ సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ని ఎదుర్కొనే దమ్ము వీరెవరికీ లేదని.. ఐదు కోట్ల జనం ఆయన వెంట ఉన్నారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఏం తమాషాగా ఉందా.. పోలీసులకే వార్నింగ్‌ ఇచ్చిన నారా లోకేష్‌ బాబు..

>
మరిన్ని వార్తలు