ప్యాకేజీల పవన్‌, బాబులతో ఒరిగేదేమీ లేదు: మంత్రి కాకాణి

18 Oct, 2022 12:53 IST|Sakshi

సాక్షి న్యూస్‌, నెల్లూరు: జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రోకర్ లా విన్యాసాలు చేస్తున్నాడని, చంద్రబాబు స్నేహంతో పవన్‌కి కూడా మతిమరుపు రోగం వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులకు ఓకే చెప్పిన నోటితోనే నేడు పవన్‌ వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నాడని గుర్తు చేశారు మంత్రి కాకాణి. మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి.. పవన్ కల్యాణ్‌ సినిమాల్లో హీరో కావొచ్చు కానీ, రాజకీయాల్లో జీరో అంటూ దుయ్యబట్టారు.  

‘ప్యాకేజీల పవన్‌గా రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గుర్తించారు. ఒక్కచోట కూడా ఆయనని ప్రజలు గెలిపించలేదు. నారా వారి రాజ్యాంగంలో విశాఖ ఎయిర్‌పోర్టులోనే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్‌ని పోలీసులు అడ్డుకొన్నారు. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉండబట్టే పవన్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. చంద్రబాబుకి సుపుత్రుడిపై నమ్మకం లేదు. దత్తపుత్రుడిని అడ్డం పెట్టుకొని లబ్ధిపొందాలని చూస్తున్నాడు..

2024లో కుప్పంలో కూడా చంద్రబాబుకి ఓటమి తప్పదు. చంద్రబాబు, పవన్ లాలూచీ వల్ల ఒరిగేదేమీ లేదు. వారి మధ్య రహస్య ఒప్పందం జగమెరిగిన సత్యం. సంక్షేమ సారథి వైఎస్ జగన్‌ని విమర్శించే అర్హత పవన్‌కి లేదు. జగన్ ప్రభంజనానికి చంద్రబాబు అడ్రస్‌ గల్లంతైపోయింది. రాజకీయ ఓనమాలు రాని నువ్వు గాలికి కొట్టుకుపోతావు. పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం హాస్యాస్పదం. పొరపాటు చేస్తే ఎవరినీ విడిచి పెట్టం.’ అని హెచ్చరించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. పవన్ కళ్యాణ్ రాజ్యాంగానికేమైనా అతీతుడా అంటూ ప్రశ్నించారు. సీఎం కావాలని పగటి కలలు కంటే సరిపోదని, హుందాగా వ్యవహరించి మర్యాద కాపాడుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: అమరావతి యాత్ర ముసుగులో టీడీపీ, జనసేన రౌడీయిజం.. స్థానికులపై దాడి

మరిన్ని వార్తలు