ఎంపీ పిల్లి సుభాష్ వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి స్పష్టత

19 May, 2022 14:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఈనాడు విషపు రాతలపై కోర్టుని ఆశ్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు. ధాన్యం కొనుగోలులో దోపిడీ అంటూ ఈనాడు పత్రికలో వచ్చిన వార్త హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆర్‌బీకే ద్వారా రైతులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని పేర్కొన్నారు. ఈనాడు కథనం పూర్తి అవాస్తవమని, ఆర్‌బీకేలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయాలని సీఎం అధికారులకి స్పష్టమైన ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు.

‘పొలమే లేని వ్యక్తి ఆర్‌బీకేకు ధాన్యం అమ్మడానికి వెళ్లగా తిరస్కరించినట్లు ఈనాడు పత్రిక సృష్టించింది. తనకి పొలమే లేదని, తాను రైతునే కాదని, అదంతా అబద్దమని ఆ వ్యక్తే చెబుతున్నారు. రైతులే కాని వారిని రైతులగా చూపిస్తూ తప్పుడు వార్తలతో విషప్రచారం చేస్తున్నారు. రైతులకి మేలు చేయడానికే ఈ ప్రభుత్వం‌ ఉంది. ఈనాడు విషప్రచారంపై కోర్టుని ఆశ్రయించనున్నాం. దిగజారుడు వార్తలతో మీ పత్రిక విలువ మరింత దిగజార్చుకుంటున్నారు. రాజ్యసభ ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌ చెప్పిన మాటలకు.. ఈనాడు వార్తకు సంబంధం లేదు’ అని మంత్రి అన్నారు.

ఈ కేవైసీ త్వరగా చేయకపోవడం వల్ల తప్పులు జరిగే అవకాశాలున్నాయని మాత్రమే ఎంపీ సుభాష్‌ చంద్రబోస్ చెప్పినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ స్పష్టం చేశారు. 68 వేల రైతులు తూర్పుగోదావరిలో ఉంటే 51 వేల మంది నమోదు చేస్తుకున్నారని, ఇంకా 17 వేల మంది రైతులు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రత్యేక మేళా ద్వారా ఈ కేవైసీ త్వరగా నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కేవైసీ నమోదు ద్వారా అక్రమాలకి ఆస్కారం ఉండదన్నారు. మిల్లర్లు, అదికారులు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు